త్వరపడండహో..

త్వరపడండహో.. - Sakshi


నేటినుంచి నగరాలు, పట్టణాల్లో ఆహార భద్రత, పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ

 

 పట్టణాలు, నగరాల్లో ఆహార భద్రత కార్డులు, సామాజిక పింఛన్ల దరఖాస్తులను బుధవారం నుంచి స్వీకరించనున్నారు. ఓవైపు గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగానే.. మరోవైపు పట్టణ, నగర ప్రాంతాల్లో ఈ నెల 29 నుంచి నవంబర్ ఒకటిలోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసేందుకు సర్కారు నిర్ణయించింది.



ముందుగా నవంబర్ ఒకటినుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆహార భద్రత కార్డులకు ముందే నవంబర్ 8 నుంచి పింఛన్లు పంపిణీ చేసేందుకు వేగవంతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సమయాభావం దృష్ట్యా ఈ మార్పులు చేసినట్టు తెలిసింది.


 

 ముకరంపుర :

 జిల్లాలోని కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లు, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలు, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, పెద్దపెల్లి, వేములవాడ నగర పంచాయతీల్లో ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను గుర్తించారు. ప్రతి వార్డు, డివిజన్ కేంద్రంలో ప్రజలకు అనువైన ప్రాంతంలో కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.



   ప్రతి కేంద్రంలో ఆహార భద్రత, పెన్షన్ల కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఆహార భద్రతకు అర్హులైన వారికే పెన్షన్ వర్తిస్తుందని ప్రభుత్వ మార్గదర్శకాలున్న నేపథ్యం లో పెన్షన్ దరఖాస్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్‌లో ఆహార భద్రతతో పాటు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. కేవలం ఆహార భద్రత కార్డు అవసరమైతే దానికోసం ఏర్పాటు చేసిన కౌంటర్‌లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.



   జిల్లాలోని రెండు నగరాలు, తొమ్మిది పట్టణాల్లో 10.50 లక్షల జనాభా ఉండగా.. మూడు లక్షల తెల్లరేషన్‌కార్డులు, 80 వేల పింఛన్లు ఉన్నాయి. ఒక్క కరీంనగర్‌లోనే 73 వేల కుటుంబాలు, మూడు లక్షల జనాభా ఉండగా, 36 వేల కార్డులున్నాయి. నాలుగు రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయడంతో జనానికి అగచాట్లు తప్పేలా లేవు.



 తెల్లకాగితంపైనే దరఖాస్తులు

 ఆహార భద్రత, పింఛన్లకు అర్హులైన వారు (ప్రస్తుతం రేషన్‌కార్డు, పింఛన్లు పొందుతున్నవారితో పాటు) బుధవారం నుంచి నవంబర్ ఒకటి వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దరఖాస్తులు స్వీకరిస్తారు. వార్డులు, డివిజన్ల వారీగా నిర్ణయించిన కేంద్రాల్లో తెల్లకాగితంపై దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య సూచించారు.



   దరఖాస్తులో ఇంటి నెంబర్, కుటుంబ వివరాలు, ఆధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్, వికలాంగులైతే సదరం ఐడీ నెంబర్  రాసి సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణకు ప్రతి కేంద్రంలో మున్సిపల్ సిబ్బందిని నియమించారు. ఒక్కో కేంద్రంలో మున్సిపల్, మెప్మా సిబ్బంది ఇద్దరు ఉంటారు. ప్రతి 5 నుంచి 7 డివిజన్/వార్డులకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు.



   నవంబర్ 2 నుంచి 6 వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులపై రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి విచారణ నిర్వహిస్తారు. అనంతరం లబ్దిదారుల జాబితాలను సిద్ధం చేసి సర్కారుకు నివేదిస్తారు.



 మంత్రి కేటీఆర్ సమీక్ష

 రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం సాయంత్రం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆహార భద్రత, పెన్షన్ల దరఖాస్తులు, విచారణ, లబ్దిదారుల ఎంపికపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులందరికీ నవంబర్ 8 నుంచి పింఛన్లు పంపిణీ చేయాలన్నారు. అందుకోసం పింఛన్ల దరఖాస్తుల విచారణను ముందుగా పూర్తి చేసి లబ్దిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. పింఛన్లు గ్రామ పంచాయతీల్లో పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ జాయింట్ కలెక్టర్ నంబయ్య, డీఆర్‌వో టి.వీరబ్రహ్మయ్య, డీఆర్‌డీఏ పీడీ విజయ్‌గోపాల్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top