పసుపు రైతులకు కష్టకాలమే..

కేసముద్రం : పసుపు రాశుల వద్ద రైతుల పడిగాపులు - Sakshi


 మొదటిసారిగా రూ.4వేల ధర ప్రకటించిన ప్రభుత్వం

 పెట్టుబడి పెరగడంతో నష్టపోతున్న రైతులు

 

 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్,జిల్లాలో పసుపు సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కష్టకాలమే ఎదురవుతోంది. ఇప్పటికే సాగు కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేసిన రైతులు కనీస ధర లభించకపోవడంతో ఆవేద న చెందుతున్నారు. రెండు నెలల క్రితం నుంచి మార్కెట్లకు పసుపు వస్తుండగా... ప్రభుత్వం ఎన్నడూలేని విధంగా పసుపు క్వింటాల్‌కు రూ.4 వేలుగా ఎంఎస్‌పీ ధర నిర్ణయించింది. అయితే, కనీసం రూ.5వేల ధర నిర్ణయిస్తే లా భం జరిగేదని రైతులు చెబుతున్నారు.



 గతంలో రూ.10వేలు

 రెండేళ్ల క్రితం పసుపు క్వింటాల్‌కు రూ.10వేల వరకు ధర పలికింది. దీంతో రైతులు పసుపు సాగుపై ఆసక్తి పెంచుకోగా.. గత ఏడాది మా త్రం రూ.4వేల నుంచి రూ.5వేల వరకే ధర లభించింది. ఆ సంవత్సరం వరంగల్ మార్కెట్‌కు 50,845 క్వింటాళ్ల పసుపు వచ్చింది. దీంతో ఈసారి ఎలా ఉంటుందోనని రైతులు బెంగ పడుతున్నట్లుగానే ప్రభుత్వం రూ.4వేల ధర నిర్ణయించడంతో..



 వ్యాపారులు కూడా కొ ద్దిగా అటూఇటు ఇదే  ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇచ్చేది కూడా ఇంతేనని దబాయిస్తుండడం చేసేదేం లేక రైతులు పసుపు అమ్ముకుని నిరాశగా వెనుతిరుగుతున్నారు. మరికొందరు మాత్రం ధర పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.



 కేసముద్రంలోనూ అదే తీరు..

 కేసముద్రం : కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో రెండు రోజులుగా పసుపు అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ సీజన్ అడపాదడపా పసుపు వస్తుండగా.. బుధవారం నాలుగు వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. గత ఏడాది క్వింటాల్ పసుపు రూ.3200 నుంచి రూ. 4వేల వరకు ధర లభించగా, రైతులు నష్టపోయారు.



ఈసారి అకాల వర్షాలతో పసుపు దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ లో బుధవారం కాడి రకం క్వింటాల్‌కు రూ.5725-రూ.4631, గోల రకానికి రూ.5800-రూ.4600 ధర లభించింది. ఇలా కనీసం గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆవేదన చెందుతుండగా.. కాం టాలు సరిగ్గా సాగక రాశుల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది.

 

 ఈసారి ఎంతగానో ఆశపడ్డాను

 గత సంవత్సరం పసుపు ధర భాగా తగ్గడంతో ఈ ఏడాది మంచి ధర లభిస్తుందని ఆశపడి సాగు చేశాను. కానీ ధర ఏ మాత్రం పెరగకపోవడంతో తల పట్టుకోవాల్సిన పరిస్థితి. నేను చేసిన అప్పులు మిగిలేలా ఉన్నాయి.

 - అనుముల సంజీవ, మొండ్రాయి  

 

 ఇక పసుపు సాగుచేయను

 ఎంతో కష్టపడి ఎక్కువ పెట్టుబడితో పసుపు సాగు చేస్తే అందులో సగం కూడా ధర రావడం లేదు. ఇక నుంచి పసు పు సాగు చేయొద్దని నిర్ణయించుకున్నా. ఐదేళ్లుగా పసుపు సాగు చేస్తున్న నాకు ఎప్పుడూ ఓ ఇబ్బంది ఎదురవుతోంది.

 - గుగులోతు బిక్షపతి, దీక్షకుంట్ల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top