గులాబీ గూటికి తుమ్మల.. ముహూర్తం ఖరారు

గులాబీ గూటికి తుమ్మల.. ముహూర్తం ఖరారు - Sakshi


సాక్షి, ఖమ్మం : తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీమంత్రి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 5న ఆయన టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన వెంటనే తన స్వగ్రామం దమ్మపేట మండలం గండుగులపల్లికి బయలుదేరి వెళ్లారు. కాగా, ఆదివారం సత్తుపల్లిలో అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి నియోజకవర్గాల ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరిక తేదీని అనుచర నేతలు ప్రకటించారు. తనకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన సత్తుపల్లినేటీఆర్‌ఎస్‌లో చేరిక నిర్ణయానికి వేదికగా ఎంచుకోవడం గమనార్హం.



ఈ సమావేశంలోనూ తుమ్మల మాట్లాడుతూ ‘నాకు రాజకీయ జన్మనిచ్చి ఈ స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ జన్మజన్మలా రుణపడి ఉంటాను’ అని భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కొండబాల కోటేశ్వరరావు తుమ్మల రాజకీయ ప్రస్థానాన్ని వివరిస్తుండగా... పలుమార్లు తుమ్మల కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మె ల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పరోక్షంగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును విమర్శిం చారు. ఆయన నియంత పోకడ వల్లే పార్టీ నుం చి బయటకు వచ్చామని తెలిపారు. గతంలో తనకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకున్న వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ ఆవేదనకు గురయ్యారు. ఇది నచ్చకే తామంతా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.



5న తెలంగాణ భవన్‌లో చేరిక..

 ఈనెల 5న తెలంగాణ భవన్‌లో తుమ్మలతోపాటు టీడీపీకి రాజీనామా చేసిన నేతలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతారని బాలసాని ప్రకటించారు. ముహూర్తానికి మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో తుమ్మల అనుచర గణం భారీగా రాజధానికి తరలివెళ్లేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. సుమారు 3వేల వాహనాల్లో హైదరాబాద్ చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బాలసాని ‘సాక్షి’కి తెలిపారు. ఆరోజు ఉదయం 9 గంటలకు అన్ని నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి ఖమ్మం చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు సాయంత్రం 4.30 గంటలకు తుమ్మలతోపాటు అనుచర నేతలంతా తెలంగాణ భవన్‌కు చేరుకుని,  4.30 - 5 గంటల మధ్యన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.



 భారీగా ఫ్లెక్సీల ఆర్డర్లు..

 తుమ్మల టీఆర్‌ఎస్‌లో చేరుతున్న నేపథ్యంలో అనుచర నేతలు, అభిమానులు జిల్లా అంతటా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం,మధిర, ఇల్లెందు నియోజకవర్గాలను గులాబీ మయం చేసేందుకు తుమ్మల ప్రధాన అనుచర నేతలు కేసీఆర్, తుమ్మల నిలువెత్తు చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను తయారు చేసేందుకు హైదరాబాద్‌లో ముందస్తుగా ఆర్డర్ ఇచ్చారు. పార్టీలో చేరిక రోజు నియోజకవర్గ కేంద్రాలన్నీ గులాబీమయం చేయడంతోపాటు టీడీపీ నాయకులకు షాక్ ఇచ్చేలా భారీ ఎత్తున తరలివెళ్లాలని తుమ్మల అనుంగునేతలు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. తుమ్మల చేరిక నాటికి మరికొంతమంది కూడా టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top