‘ఉత్తమ్‌ మూర్ఖుడా..నాయకుడా?’

‘ఉత్తమ్‌ మూర్ఖుడా..నాయకుడా?’ - Sakshi


హైదరాబాద్‌:  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. ఉత్తమ్‌ నాయకుడా, మూర్ఖుడా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉత్తమ్ మూర్ఖుడయితేనే భూసేకరణకు తొందరేమిటని మాట్లాడతారన్నారు. భూసేకరణకు కచ్చితంగా తొందర ఉంటుందని, అందుకే ఆదివారమైనా అసెంబ్లీ పెడుతున్నామని తుమ్మల అన్నారు. ఎపుడు ఏ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే కనీస రాజకీయ పరిజ్ఞానం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతల శ్రీరంగ నీతులు వినడానికి ఎవరూ సిద్ధంగా లేరని, లుచ్చా, లఫంగి పాలనలో ఎపుడైనా ఇప్పుడిస్తున్న ధరలు రైతుల పంటల కిచ్చారా అని ప్రశ్నించారు.



కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనూ, ఇప్పుడు తమ హయాంలో పంటలకు ఇచ్చిన మద్దతు ధరలపై చర్చకు సిద్ధమా అని సవాల్‌ తుమ్మల విసిరారు. ఖమ్మం మిర్చి యార్డుపై జరిగిన దాడిని మంత్రి తీవ్రంగా ఖండించారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇలాంటి దాడులు సరి కావన్నారు. రైతు సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలన్న తపన ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలిపారు. అధికారం పోయిందనే దుగ్దతోనే విపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. రైతు బాగుండడం విపక్షాలకు ఇష్టం లేనట్టుందని వ్యాఖ్యానించారు. పిచ్చివాళ్ళు కూడా ప్రతిపక్ష నేతల్లాగా నీచంగా ప్రవర్తించరని అన్నారు.



ఖమ్మం మిర్చియార్డులో శుక్రవారం జరిగిన ఘటన ప్రతిపక్షాల పిచ్చికి పరాకాష్ట అని ఎత్తిపొడిచారు. మార్కెట్‌లో రాళ్లు విసిరింది ముమ్మాటికీ కాంగ్రెస్, టీడీపీ మూఠాలేనని ఆరోపించారు. సీసీ టీవీ ఫుటేజిలో ఎవరు దాడి చేశారో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. రైతులు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి, పసుపు వంటి వాణిజ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటించే విధానం లేదని చెప్పారు. అయినప్పటికీ కేంద్రాన్ని పదే పదే ఈ పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలని మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్ రావు కోరుతూనే ఉన్నారని వెల్లడించారు. కేంద్రం ఎందుకో ఈ పంటలపై నిర్లిప్తంగా ఉందన్నారు.  



దేశంలో ఇప్పటికీ మిర్చి పంటకు అధికంగా ధర ఇస్తోంది తెలంగాణాయేనని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ లాంటి వారికి వ్యవసాయంపై అవగాహన లేదు, ఆయన మిర్చి ధరలకు కేంద్రానికి సంబంధం లేదంటున్నారని చెప్పారు. మరి మిగతా పంటలన్నిటికీ మద్దతు ధరలు ప్రకటిస్తోంది కేంద్ర ప్రభుత్వమా?పాకిస్తానా ? అని నిలదీశారు. సాగునీటి శాఖ రంగ సలహా దారు విద్యాసాగర్ రావు మరణం తెలంగాణకు తీరని లోటని ఆయన తెలిపారు. ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఒక నిమిషం మౌనం పాటించారు. ప్రెస్‌మీట్‌లో ఆయనతోపాటు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి , విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top