మాకు చాంబర్ ఇవ్వండి.. లేదంటే మీ గదికే బోర్డు పెడతాం!




 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేల గదుల గొడవ ఇంకా కొలిక్కి రావడం లేదు. శాసనసభ లోపల ఆ పార్టీ శాసనసభ పక్షానికి కేటాయించిన గది చిన్నదిగా ఉందని, రెండు పెద్ద గదులు కేటాయించాలని మంగళవారం శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి హరీశ్‌రావుతో టీడీపీ ఎమ్మెల్యేలు గొడవకు దిగారు. జీరో అవర్ అనంతరం సభ వాయిదాపడిన సమయంలో టీడీఎల్‌పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇతర ఎమ్మెల్యేలు హరీశ్‌రావును కలసి తమకు రెండు గదులున్న పెద్ద చాంబర్ కేటాయించాలని కోరారు. సీఎల్‌పీ నాయకుడు జానారెడ్డి చాంబర్ ముందున్న చిన్నగది తమకు ఏమాత్రం సరిపోవడం లేదనీ, దీనిపై కార్యదర్శికి లేఖ ఇచ్చినా పట్టించుకోవడం లేదని, ఏపీ మంత్రుల చాంబర్లలో కూర్చోవలసి వస్తుందని చెప్పారు.


దీనిపై స్పందించిన హరీశ్‌రావు ‘గది కేటాయించినా మీరే ఏపీ మంత్రుల చాంబర్లలో కూర్చుంటుంటే మేమేం చేస్తాం’ అని సమాధానమిచ్చారు. అందుకు ప్రతిగా ‘మమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు బయటకు పంపడానికి ఏపీ మంత్రుల లాబీని తెరిపించింది మీరే కదా. ఎలాగూ లాబీ తెరిచారనే ఉద్ధేశంతో ఓ గదిలో కూర్చుంటున్నాం. మీరు చాంబర్ కేటాయిస్తే మాకు అక్కడ కూర్చోవలసిన అవసరమేంటి? రేపటిలోగా మాకు రెండు గదులున్న చాంబర్ కేటాయించకపోతే మీ చాంబర్‌కే మా బోర్డు తగిలించుకుంటాం’ అని స్పష్టం చేశారు.




 ఏపీకి కేటాయించిన గదులను వాడుకుంటున్నారు: హరీశ్‌రావు

 

 ‘అసెంబ్లీలోని నా చాంబరుకు మీ టీడీఎల్పీ బోర్డు పెట్టి చూడండి.. ఏమైతదో’ అని టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. అసెంబ్లీ ఆవరణలో పార్టీకి గదులను కేటాయించకుండా అవహేళన చేయడం సమంజసమా? అని టీటీడీపీ ఎమ్మెల్యేలు హరీశ్‌రావును కలిశారు.  ఈ విషయమై హరీష్‌రావు లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ ‘అసెంబ్లీలోని 104, 105 నంబరు గదులను టీడీపీకి కేటాయించారు. వారి అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా ఆ గదుల్లో మార్పుచేర్పులు చేస్తామని చెప్పాము. ఆ గదులు బాగాలేవంటూ వారే తీసుకోలేదు. తెలంగాణ గదులను తీసుకోకుండా, ఏపీకి కేటాయించిన గదులను వారు వాడుకుంటున్నరు. అదే విషయం చెప్పిన. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రులకు కూడా సరైన వసతిని కల్పించలేకపోతున్నం. ఇంకా చీఫ్ విప్, విప్‌లు, పీఏసీ వంటివి ఏర్పాటు కాలేదు. టీడీపీ నేతలు పేచీపెడుతూ, ఏపీ గదులను వాడుకుంటున్నరు’ అని హరీశ్‌రావు వివరించారు. ‘నా గదికి టీడీఎల్పీ అని మారుస్తరా? మార్చి చూడనీ.. ఏమైతదో’ అని హెచ్చరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top