టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై పోరాటాలు: గట్టు

టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై పోరాటాలు: గట్టు - Sakshi


2019 ఎన్నికలే లక్ష్యంగా కార్యాచరణ

ఏప్రిల్‌ 30 లోపు పార్టీ కమిటీలు పూర్తి

పార్టీ ఆధ్వర్యంలో త్వరలో భారీ ధర్నా




సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీనీ సీఎం కేసీఆర్‌ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ సమన్వయకర్తలు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు.



 సీఎం చెప్పే డబుల్‌ బెడ్రూం ఇళ్లు తమకెక్కడా కన్పించడం లేదని పేదలు అంటున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇళ్లిచ్చారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఒక్క రైతుకు కూడా రుణం పూర్తిగా మాఫీ కాలేదు. నాడు వైఎస్సార్‌ ఒక్క సంతకంతో వారి రుణాలను పూర్తిగా మాఫీ చేశారని ప్రజలే అంటున్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కల్పించి ఎందరో పేదలకు ఉన్నత చదువులు చదివే అవకాశం వైఎస్‌ కల్పించారు. తెలంగాణలో ఏకంగా 36 ప్రాజెక్టులు ప్రారంభించి ఆదర్శంగా నిలిచారు. కానీ ప్రజా సంక్షేమం కోసం ఆ మహానేత ప్రారంభించిన సంక్షేమ పథకాలను ఇప్పుడు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు’’ అని గట్టు విమర్శించారు.



వద్దన్న పత్తికి ధర పెరిగింది.. వేసుకొమ్మన్న మిర్చి,కందుల ధరలు తగ్గాయి

రైతులు పత్తి పంట వేసుకుంటుంటే ప్రభుత్వం వద్దని చెప్పిందని, ఇప్పుడేమో పత్తి రేటు బాగా పెరిగిపోయిందని గట్టు అన్నారు. మిర్చి, కంది వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తే వాటి ధరలేమో ఇప్పుడు అమాంతం తగ్గాయని ఆవేదన వెలిబుచ్చారు. ఏప్రిల్‌ 2 నుంచి 30 వ తేదీలోగా జిల్లాలు, మండలాలు, గ్రామాల పార్టీ కమిటీలు పూర్తి చేయాలని సూచించారు. 2019 లక్ష్యంగా పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి పనిచేయాలని కోరారు. సీఎం కేసీఆర్‌ వైఫల్యాలపై ఎక్కడిక్కడ జిల్లా పార్టీ శ్రేణులు ఉద్యమాలు చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో భారీ ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు.



గీత దాటితే ఉపేక్షించేది లేదు

వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం, వైఎస్‌ జగన్‌ బాటలో కార్యకర్తల నుంచి నాయకుల దాకా అందరూ నడవాల్సి ఉందని గట్టు సూచించారు. ‘‘ఎంతటి వారైనా పార్టీ నియమావళి ప్రకారమే నడుచుకోవాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎవరినీ చూస్తూ ఊరుకునేది లేదు’’ అని హెచ్చరించారు. ఎవరికి కేటాయించిన నియోజకవర్గాల్లో వారు 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, జి.రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడారు. ప్రధాన కార్యదర్శులు మతీన్‌ ముజాద్దాదీ, బోయినపల్లి శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి, గ్రేటర్‌ హైదరాబాద్‌ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top