‘నల్లగొండ’లో టీఆర్‌ఎస్ గెలుపు

నల్లగొండలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి గజమాల వేస్తున్న పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్, ఎమ్మెల్యే వీరేశం తదితరులు


   రెండో ప్రాధాన్యత ఓటుతో గెలిచిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి

   మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజార్టీకి 7,013 ఓట్లు తక్కువ

   ఎలిమినేషన్ ప్రక్రియలో 67,183 ఓట్లు సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి

    రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి.. అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చిన రామ్మోహనరావు





సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుపై రెండో ప్రాధాన్యత ఓటుతో 11,940 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిరౌండ్‌లో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఏ అభ్యర్థికీ మెజార్టీ రాకపోవడంతో... రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి వచ్చింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఎలిమినేట్ చేసి.. ప్రక్రియను కొనసాగించగా గెలుపునకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 66,777 ఓట్లకు మించి 67,183 ఓట్లను రాజేశ్వర్‌రెడ్డి సాధించారు. ఈ సమయానికి రామ్మోహనరావుకు 55,243 ఓట్లు వచ్చాయి. దీంతో 11,940 ఓట్ల మెజారిటీతో రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. ఈ మేరకు రాత్రి 11 గంటల సమయంలో రిటర్నింగ్ అధికారి పి.సత్యనారాయణరెడ్డి ఆయనకు ధ్రువీకరణపత్రాన్ని అందజేశారు.



పోటా పోటీ..: మొత్తంగా నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గంలో 1,53,547 ఓట్లు పోల్‌కాగా.. 1,51,413 ఓట్లు చెల్లినవిగా గుర్తించారు. ఇందులో 50 శాతం కన్నా ఒక ఓటు అదనంగా అంటే.. 66,777 ఓట్లు సాధించిన అభ్యర్థి గెలుపొందినట్లు లెక్క. కానీ పోటీ చేసిన 22 మంది అభ్యర్థుల్లో తొలుత ఎవరికీ మెజారిటీ రాలేదు. తొలి రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి 59,764 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి రామ్మోహనరావు 47,041 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 13,033 ఓట్లు, వామపక్షాల మద్దతుతో పోటీచేసిన సూరం ప్రభాకర్‌రెడ్డి 11,580 ఓట్లు సాధించారు. మిగతా 18 మంది స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 2,154 ఓట్లు వచ్చాయి. దీంతో మెజార్టీ ఓట్ల కోసం రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు.



పల్లా రాజేశ్వర్‌రెడ్డికి బీజేపీ నుంచి పోటీ చేసిన ఎర్రబెల్లి రామ్మోహనరావు గట్టి పోటీ ఇచ్చినా.. మెజార్టీకి అవసరమైన ఓట్లు సాధించలేకపోయారు. మొత్తంగా 16 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా... ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అయితే ఏ రౌండ్‌లోనూ భారీ మెజారిటీ సాధించలేకపోయారు. బీజేపీ కన్నా సరాసరి 750 ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చింది. అదే సమయంలో వామపక్షాలు, కాంగ్రెస్ అభ్యర్థులకు కలిపి ప్రతి రౌండ్‌లో 1,500 ఓట్ల వరకు వచ్చాయి. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతోనే అధికార పార్టీ అభ్యర్థి గెలుపొందారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా మందకొడిగా సాగింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ముగిసి విజేతను అధికారికంగా ప్రకటించేందుకు 37 గంటల 30 నిమిషాల సమయం తీసుకోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top