ఇదీ.. మీ పనితీరు

ఇదీ.. మీ పనితీరు - Sakshi

► సర్వే బాంబు

► ఎమ్మెల్యేల పని విధానంపై సర్వేల నివేదిక 

► స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్‌

► మీరు మారాలని శాసనసభ్యులకు క్లాస్‌

► లోపాలను సరిదిద్దుకోవాలని ఆదేశం

► బహిరంగ సభలు నిర్వహించాలని సూచన

► సర్వేలో ఎర్రబెల్లి ఫస్ట్, వినయ్‌భాస్కర్‌ సెకండ్‌ 

► ఆఖరులో ఎమ్మెల్యే రాజయ్య, మంత్రి చందూలాల్‌

 

సాక్షి, వరంగల్‌ :

అధికార పార్టీలో సర్వే అలజడి నెలకొంది. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సర్వే వివరాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండడం, టీఆర్‌ఎస్‌పై ప్రజల స్పందన వంటి అంశాలతో ఈ సర్వే చేయించారు. రెండు దశల్లో చేసిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్‌ స్వయంగా వెల్లడించారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్ననేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. 

 

ఈ సమావేశం అనంతరం పాత జిల్లాల వారీగా మంత్రులు, శాసనసభ్యులతో సీఎం ప్రత్యేకంగా సమావేశయమ్యారు. ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే వివరాలను వారికి స్వయంగా అందజేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో అనుకూలత ఉన్నా... స్థానికంగా ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఉందని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా లోపాలను వెంటనే సరిచేసుకోవాలని ఆదేశించారు. 

 

టీఆర్‌ఎస్‌పై, ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు. బాగా ప్రతికూలత ఉన్న నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని, స్వయంగా తానే ఈ సభలకు హాజరవుతానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో సమన్వయం చేసుకుని బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, డోర్నకల్‌ ఎమ్మెల్యే డి.ఎస్‌.రెడ్యానాయక్‌ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

శాసన సభ్యుల పనితీరుపై టీఆర్‌ఎస్‌ అధినేత  కేసీఆర్‌ 2016 అక్టోబర్‌లో, 2017 జనవరిలో రెండు దశలుగా సర్వేలు నిర్వహించారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల వివరాలను అందరు ఎమ్మెల్యేలకు అందజేశారు.


 


► పనితీరు పరంగా పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ సర్వేలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.


 


► నర్సంపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దొంతి మాధవరెడ్డి పనితీరు పరంగా ఆఖరు స్థానంలో ఉన్నారు. 


 


►  స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య 11వ స్థానంలో, ములుగుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి అజ్మీరా చందూలాల్‌ 10వ స్థానంలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top