ఈటల టాప్‌

ఈటల టాప్‌ - Sakshi

► మంత్రి కేటీఆర్‌కు తొలి, రెండో సర్వేకు10.20 శాతం తేడా

► ముగ్గురు ఎమ్మెల్యేలకు అత్తెసరు మార్కులు

► పలువురు ఎమ్మెల్యేలకు ఏటా తగ్గిన గ్రాఫ్

► జగిత్యాలలో పుంజుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి

► ఎమ్మెల్యేలపై అధికార పార్టీ సర్వే విడుదల

► ప్రజల మనోభావాలను కళ్లకు కట్టిన సీఎం కేసీఆర్‌

► జనంతో మమేకం కావాలని ఉద్బోధ

► ఏటా పెరుగుతూ వచ్చిన రాజేందర్‌ పనితీరు

► ఉమ్మడి జిల్లాలో 89.90 శాతం జనం మెచ్చిన నేత

 

సాక్షి, కరీంనగర్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల పనితీరును గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారి కళ్లకు కట్టారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి పనితీరు, రెండు విడతలు నిర్వహించిన సర్వే ఫలితా లను వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లాల వారీగా సర్వే నివేదికల ఆధారంగా సమీక్ష జరిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

 

ఈ సందర్భంగా నేతల జాతకాన్ని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 12 కాగా.. శాసనసభ్యులు, శాసనసభ నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరు, టీఆర్‌ఎస్‌ పార్టీ, ఇతర పార్టీల బలాబలాలను కేసీఆర్‌ వివరించారు. ప్రజాక్షేత్రంలో ఉండే వారికి ప్రజల వేసిన మార్కులను వివరించడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

 

మంత్రి ఈటల రాజేందర్‌కు ఫస్ట్‌ ర్యాంకు..  తొలి సర్వే, రెండో సర్వేకు భారీ తేడా..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై టీఆర్‌ఎస్‌ నిర్వహించిన సర్వేలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ప్రజలు ఫస్ట్‌ ర్యాంకు ఇచ్చారు. ఏటా ఆయన ప్రజలకు చేరువవుతున్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. కాగా.. టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులుగా ఎన్నికైన తరువాత 2015–16 సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్‌ మాసంలో మధ్య ఆ పార్టీ మొదట సర్వే జరిపించింది. తొలి సర్వేలో మంచి మార్కులు సాధించిన వారు కూడా రెండో సర్వేలో దారుణంగా వెనుకబడడం గమనార్హం. 

 

మంత్రి ఈటల రాజేందర్‌ తొలి సర్వేలో 73.50 శాతంగా ఉంటే.. రెండో సర్వే నాటికి ఆయన పనితీరు 89.90 శాతానికి పెరిగింది. ఆ తర్వాత ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ తొలి సర్వేలో 42.60 శాతం మార్కులు రాగా, రెండో సర్వేలో 47.30 శాతానికి పెరిగింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌ 70.60 నుంచి 60.40 శాతంగా మారింది. తొలి, రెండో సర్వేలతో పోలిస్తే జిల్లా ఎమ్మెల్యేల్లో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు మార్కులు తగ్గాయి. అదే వరుసలో మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, ఆ తర్వాత కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఉన్నారు. 

 

కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నాలుగు శాతం తేడాతో ఉండగా, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 88.10 శాతం నుంచి 56 శాతానికి, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ 67.60 నుంచి 53.90కి, చొప్పదండి ఎమ్మెల్యే 79.40 నుంచి 62.50, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 75.50 నుంచి 54.20కి తగ్గారు. కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్‌రెడ్డి తొలి, రెండో సర్వేకు గ్రేడ్‌ పెరిగింది. తొలి సర్వేలో 50.90 శాతం ఉండగా.. రెండో సర్వే నాటికి 68.90 శాతానికి పెరిగింది. 

 

అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా మారాలి...  ప్రజలతో మమేకం కావాలి

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మనస్సులో నిలవడంతోపాటు చిరస్థాయి పేరు ప్రఖ్యాతలు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆయన జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన 13 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తాను నిర్వహించిన సర్వే వివరాలను వెల్లడించిన సీఎం 60 శాతానికి పైగా ప్రజల మద్దతు పొందిన ఎమ్మెల్యేలను అభినందించారు.

 

మిగతా వారు కూడా పనితీరు మెరుగుపరుచుకొని ప్రజల్లో చెరగని ముద్ర వేసుకోవాలన్నారు. ప్రజల మద్దతే పనితీరుకు కొలమానమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకం అవుతూ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించినట్లు తెలిసింది. – ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top