కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ


నల్లగొండ : జిల్లా ప్రణాళిక కమిటీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జెడ్పీటీసీ కోటా విషయంలో ఓ అవగాహనకు వచ్చిన కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు కౌన్సిలర్లకు సంబంధించి బీసీ, ఓసీ కోటా విషయంలో మాత్రం రాజీ పడకపోవడంతో బుధవారం ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలోఅధికార టీఆర్‌ఎస్ వ్యూహంతో బీజేపీ రెండు స్థానాలను దక్కించుకుంది.

 

 దీంతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు.                                         

 జిల్లా ప్రణాళిక కమిటీలో మొత్తం 30 మంది సభ్యులకుగాను కలెక్టర్, జెడ్పీ చైర్మన్ మినహాయిస్తే మరో నలుగురు సభ్యులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగిలిన 24 స్థానాలకు ఎన్నిక నిర్వహించారు. వాస్తవానికి జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్‌కు 43, టీఆర్‌ఎస్‌కు 13 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. అయితే అధికార పార్టీతో పరస్పర సహాయ సహాకారాలు ఉండాలన్న ఉద్దేశంతో జెడ్పీ చైర్మన్ చొరవ తీసుకుని జిల్లా మంత్రితో సంప్రదింపులు జరిపి ఓ అవగాహనకు వచ్చారు. ఈ మేరకు జెడ్పీటీసీ కోటాలో 20 స్థానాలకు కాంగ్రెస్ 13, టీఆర్‌ఎస్ 7 స్థానాలు కైవసం చేసుకున్నాయి.

 

 ఇదే పద్ధతిలో కౌన్సిలర్ల కోటాలో కూడా 4 స్థానాలకు చెరో రెండు స్థానాలు తీసుకోవాల్సి ఉంది. కాగా వీటిలో రెండు స్థానాలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఏకగ్రీవ మయ్యాయి. కానీ బీసీ, ఓసీ కోటాకు వచ్చే సరికి రెండు పార్టీల మధ్య పోటీ ఏర్పడింది. బీసీ కోటాలో నల్లగొండ నుంచి టీఆర్‌ఎస్ తరఫున పోటీలో ఉన్న మైనార్టీ కౌన్సిలర్‌కు ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబట్టింది. ఓసీ కోటాలో ఉన్న స్థానాన్ని దేవరకొండ నుంచి పోటీలో ఉన్న చైర్మన్  తరఫు అభ్యర్థి (ఎస్టీ)కి ఇవ్వాలని ని ర్ణయించుకున్నారు. కానీ నల్లగొండ స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు ఇవ్వడానికి వీల్లేదని స్థానిక కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకు నేలా చేశారు.

 

 అదే సమయంలో దేవరకొండ నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా నామినేషన్ ఉపసంహరించుకోవాలని టీఆర్‌ఎస్ పట్టుబట్టినా కాంగ్రెస్ నాయకులు అందుకు నిరాకరించారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వచ్చింది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం  కాకుండా జిల్లా మంత్రి, నల్లగొండ టీఆర్‌ఎస్ నాయకులు ఏకమై చక్రం తిప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఈ ఎన్నికలో సూర్యాపేట, భువనగిరి, నల్లగొండలలో ఉన్న టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ కౌన్సిలర్లు అంతా ఏకమై కాంగ్రెస్ కౌన్సిలర్లను ఓడించారు. దీంతో ఆ రెండు స్థానాలు బీజేపీ వశమయ్యాయి. భువనగిరి, నల్లగొండకు చెందిన బీజేపీ కౌన్సిలర్లు ఎం.దశరథ,రావుల శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు.

 

 ‘చే’జారిన విజయం

 జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్‌పార్టీకి మెజార్టీ సభ్యులు ఉన్నందున టీఆర్‌ఎస్‌తో అవగాహన లేకుండా నేరుగా ఎన్నికకు వెళ్లినా.. డీపీసీలో కాంగ్రెస్ పైచేయి సాధించి ఉండేది. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో కూడా కాంగ్రెస్‌కు మెజార్టీ సభ్యులే ఉన్నారు. కానీ టీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌తో దోస్తీ కట్టినట్టుగానే కనిపించినప్పటికీ చిట్టచివరకు మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ  ఖంగుతినాల్సి వచ్చింది. దీంతో జిల్లా ప్రణాళిక కమిటీలో కాంగ్రెస్‌కు దీటుగానే టీఆర్‌ఎస్ స్థానం సంపాదించినట్లైంది. నామినేటేడ్ సభ్యులతో కలిపి మొత్తం 28 స్థానాలకు గాను కాంగ్రెస్ 15, టీఆర్‌ఎస్, బీజేపీలు కలిపి 13 స్థానాలు సొంతం చేసుకున్నాయి. జెడ్పీ చరిత్రలో డీపీసీ కమిటీ కి ఎన్నిక జరగడం ఇదే ప్రథమం. అయితే కమిటీలో మూడు పార్టీలు బలంగా ఉండటంతో రాబోయే కాలంలో జెడ్పీ రాజకీయం మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top