భారీగా జన సమీకరణ


- టీఆర్‌ఎస్ సభకు జిల్లా నుంచి లక్ష మందిని తరలిస్తాం

- త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ

- తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల ఉనికి గల్లంతు

తాండూరు:
హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్న టీఆర్‌ఎస్ మొదటి బహిరంగ సభకు జిల్లా నుంచి లక్ష మందిని సమీకరిస్తున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరులోని తన నివాసంలో జన సమీకరణ ఏర్పాట్లపై పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..



ఈ నెల 24న జరిగిన ప్లీనరీ విజయవంతమైందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సోమవారం బహిరంగ సభను నిర్వహించనున్నట్టు చెప్పారు. ప్రతి జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు అధిష్టానం జన సమీకరణ ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించినట్టు పేర్కొన్నారు. పది నెలల టీఆర్‌ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాలు గర్వపడేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు, అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు.



ప్రస్తుతం గుజరాత్, తెలంగాణ ధనవంతమైన రాష్ట్రాలని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను అభివృద్ధిలో ప్రథమస్థానంలో నిలబెట్టాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం, విద్యుత్ సమస్యలు వస్తాయని చంద్రబాబునాయుడు, కిరణ్‌కుమార్‌లు విమర్శలు చేశారని, విమర్శలు చేసినవారే ఇప్పుడు తెలంగాణను అభివృద్ధి చేశామని, భవిష్యత్తు బాగుంటుందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాబోయే 20 ఏళ్ల వరకు టీఆర్‌ఎస్ అధికారంలో ఉంటుందని మంత్రి జోస్యం చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో ఉనికి గల్లంతు కావడం ఖాయమన్నారు.



ఆ పార్టీలకు కార్యకర్తలు, నాయకుల లేరన్నారు.  త్వరలోనే మార్కెట్ కమిటీ, దేవాదాయ తదితర నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ జనసమీకరణకు సుమారు 500 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు.



టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అగ్గనూర్ జగదీశ్వర్, జుబేర్‌లాల, నాయకులు గాజీపూర్ నారాయణరెడ్డి, అబ్దుల్ రవూఫ్‌లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top