‘నామినేటెడ్’పై నజర్


సాక్షి ప్రతినిధి, నల్లగొండ : టీఆర్‌ఎస్ మంత్రివర్గ విస్తరణ సంపూర్ణం కావడంతో గులాబీ నేతల్లో నామినేటెడ్ పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. త్వరలోనే వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర సంస్థలకు పాలకవర్గాలను నియమిస్తారనే ప్రచారమే ఇందుకు ప్రధాన కారణం. మొదటి నుంచీ కేసీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యం, జిల్లామంత్రి అండదండలతో నేతలు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. అయితే, నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఏది ప్రాతిపదికన తీసుకుంటారనే దానిపై జిల్లాలోని పలువురు టీఆర్‌ఎస్ నేతల భవితవ్యం ఆధారపడి ఉంది. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులకు కూడా అవకాశమివ్వాలని కేసీఆర్ భావిస్తే, నామినేటెడ్ ఆశావహుల జాబితా చాంతాడంత ఉం టుంది వారిని పక్కన పెట్టాలని భావిస్తే మాత్రం గత ఎన్నిక ల్లో టికెట్ ఆశించి భంగపడినవారు, మొదటినుంచీ పార్టీలో పనిచేస్తున్నవారు, వివిధ పార్టీల నుంచి ఎన్నికల ముందు, ఆ తర్వాత పార్టీలో చేరినవారు, వివిధ జేఏసీల్లో క్రియాశీలకంగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన వారు రేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

 ఎమ్మెల్సీ పదవుల ప్రాతిపదికనే...!

 సూర్యాపేట ఎమ్మెల్యే, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి ఇప్పటికే మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు, ఉద్యమంలో తన వెన్నంటి ఉన్న కర్నె ప్రభాకర్ (మునుగోడు)కు ఎమ్మెల్సీగా, గొంగిడి సునీత (ఆలేరు ఎమ్మెల్యే)కు ప్రభుత్వ విప్‌గా అవకాశం ఇచ్చారు. దీంతోపాటు త్వరలోనే జరగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం మనజిల్లాకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలో మొదటి నుంచీ పనిచేస్తూ సుదీర్ఘకాలంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బండా నరేందర్‌రెడ్డిని పోటీచేయించాలనే యోచన అటు కేసీఆర్‌తో పాటు ఇటు మంత్రి జగదీశ్‌రెడ్డికి ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఎన్నికల ప్రచారసభలో కేసీఆర్ బండా నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారు.

 

 అయితే, వరంగల్ జిల్లా నుంచి పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నందున, వారి నుంచి ఒత్తిడి మేరకు ఈ అభ్యర్థిత్వం ఖరారవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉంటే శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్‌గాఉన్న నేతి విద్యాసాగర్‌ను ఎమ్మెల్యేల కోటాలో మళ్లీ మండలికి పంపే అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన కూడా ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరా రు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కూడా త్వరలో ఖాళీ కానున్న నేపథ్యంలో జిల్లా నుంచి మరొకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు జిల్లాకు లభిస్తే నామినేటెడ్ కోటా కొంత తగ్గే అవకాశం ఉందని సమాచారం. అయితే, జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల్లో కూడా ముగ్గురు టీఆర్‌ఎస్ నుంచి ఎన్నికయ్యే అవకాశముంది. ఈ ముగ్గురు నేతల పేర్లు ఇప్పటికే ఖరారయినట్టు సమాచారం.

 

 గెలిచిన స్థానాల్లోనే పోటీ ఎక్కువ

 గత ఎన్నికలలో జిల్లాలో ఆరు ఎమ్మెల్యే స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపొందగా, నామినేటెడ్ పదవుల కోసం కూడా ఆయా స్థానాల్లోనే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. సూర్యాపేటతో పాటు ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు కచ్చితంగా మంచి పోస్టులు ఇవ్వాల్సిన ప్రాధాన్యం కనిపిస్తోందని పార్టీ వర్గాలంటున్నాయి. భువనగిరి నుంచి సీనియర్ నాయకుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఆలేరు నుంచి ఎమ్మెల్యే సునీత భర్త గొంగిడి మహేందర్‌రెడ్డిలకు తప్పకుండా అవకాశం లభిస్తుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఇక, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలో అయితే నలుగురు నాయకులు పదవులు  ఆశిస్తున్నారు. వీరితో పాటు న కిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నుంచి కూడా ఇద్దరు చొప్పున కీలక నేతలు పోటీ పడుతున్నారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి  బొల్లేపల్లి శ్రీనివాసరాజు, అన్నభీమోజు నాగార్జునచారి నామినేటెడ్ పో స్టులు ఆశిస్తున్నారు.

 

 హుజూర్‌నగర్ నుంచి రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉండి, గత ఎన్నికలలో శంకరమ్మను గెలిపించేందుకు పాటుపడిన సాముల శివారెడ్డి కూడా రేసులో ముందంజలోనే ఉన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు (కోదాడ)తోపాటు మాలె శరణ్యారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, చాడ కిషన్‌రెడ్డి (నల్లగొండ) కూడా ఏదో పదవి లభిస్తుందని, తమకు కేసీఆర్ ఆశీస్సులు లభిస్తాయని ఆశతో ఉన్నారు. నల్లగొండ నుంచే జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లుకు కూడా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం లభిస్తుందనే ప్రచారం జరుగుతోంది.  గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన వారికి కూడా నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, దుబ్బాక నర్సింహారెడ్డి, కె.శంకరమ్మ, అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, కె.శశిధర్‌రెడ్డి, కె.లాలూనాయక్ రేసులో ఉంటారు.

 

 వీరే కా కుండా  డాక్టర్ జడల అమరేందర్ (భువనగిరి), మం దుల సామ్యేల్, కంచర్ల రామకృష్ణారెడ్డి (తుంగతుర్తి), వేనేపల్లి వెంకటేశ్వరరావు, డోకూరి శ్రీనివాసరెడ్డి (మునుగోడు), ఆకవరపు మోహన్‌రావు, బోళ్ల కొండల్‌రెడ్డి (ఆలేరు), పూజల శంభయ్య, మారం భిక్షంరెడ్డి (న కిరేకల్), నాయిని సుధీర్‌రెడ్డి (దేవరకొండ), కట్కూరి గన్నారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, కాకి దయాకర్‌రెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ (సూర్యాపేట)లు నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సామాజిక సమీకరణలు, ఇతర అంశాల ప్రాతిపదికన వీరిలో ఎంత మందికి అవకాశం లభిస్తుందో, ఎంతమంది నామినేటెడ్ పీఠాలు దక్కించుకుంటారో, కొత్తగా ఇంకెవరు తెరపైకి వస్తారో వే చి చూడాల్సిందే.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top