ఆషాడం వెళ్లి ... శ్రావణ మాసం వచ్చినా!!

ఆషాడం వెళ్లి ... శ్రావణ మాసం వచ్చినా!! - Sakshi


ఆషాడం వెళ్లి ... శ్రావణ మాసం వచ్చినా టీఆర్ఎస్ ఆశావాదుల్లో ఆశలు తగ్గలేదు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో తమకు చోటుదక్కకపోతుందా అని నేతలు ఎదురుచూస్తున్నారు. జులై నెలాఖరుకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. అయితే విస్తరణపై ఇంకా స్పష్టత రాకపోవటంతో ఆశావాహులు ఫలితాల కోసం ఎదురు చూసే విద్యార్థుల్లా ఉత్కంఠతో ఉన్నారు.



కేసీఆర్కు మొదటి నుంచి తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలపై నమ్మకం ఉండటంతో ఆషాఢ మాసంలో కాకుండా శ్రావణ మాసంలో మంత్రివర్గ విస్తరణ తప్పక చేపడతారని  భావించటంతో ఈసారి కేబినెట్‌లో తమకు బెర్త్‌ ఖాయమని భావిస్తున్నవారు సీఎం నిర్ణయం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో తొలి ప్రభుత్వంలో మొదటిసారి ఏర్పడిన మంత్రివర్గ విస్తరణలో తమ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కకపోవడంతో పట్ల టీఆర్ఎస్ నాయకులు, ఆశావాహులు, వారి మద్దతుదారులు, ప్రజలు కొంత నిరాశకు గురయ్యారు.



ఒకవేళ మంత్రివర్గ విస్తరణ ఉంటే పదవులు ఎవరిని వరిస్తాయనే దానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది.  ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు ఈలోపే తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటివరకూ మహిళలకు ప్రాతినిధ్యం లేనందున ఓ మహిళకు ఛాన్సు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



ఇక ప్రస్తుత మంత్రివర్గంలో మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు అసలు ప్రాతినిధ్యం లేదు. పాలమూరు జిల్లాలో ఏడుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీ కూడా గెలవడంతో దక్షిణ తెలంగాణలోని ఈ జిల్లాలో టీఆర్ఎస్కు మంచిపట్టు లభించింది. దాంతో ఆ జిల్లా ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు,  లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్‌ గౌడ్‌లలో ఇద్దరికి మంత్రి పదవులు ఖాయమనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. అలాగే ఖమ్మం జిల్లా నుంచి జలగం వెంకట్రావుకు చోటు దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి శ్రావణ మాసంలో అదృష్ట లక్ష్మి ఎవరిని వరిస్తుందో చూడాలి.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top