ఎమ్మెల్సీ పదవులపై గులాబీ నేతల గురి!

ఎమ్మెల్సీ పదవులపై గులాబీ నేతల గురి!


త్వరలో మూడు ఎమ్మెల్యే కోటా స్థానాలకు ఎన్నికలు

అధికార పార్టీలో ఆశావహుల హడావుడి

ఎంఐఎం చేతిలోని స్థానంపై మల్లగుల్లాలు

‘స్థానిక’ కోటాలోనూ అందుబాటులో ఒక ఎమ్మెల్సీ సీటు




సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌లో శాసన మండలి ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకత్వం... ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా స్థానాలపైనా దృష్టి పెట్టింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న సయ్యద్‌ అల్తాఫ్‌ హైదర్‌ రిజ్వీ (ఎంఐఎం), ఎం.రంగారెడ్డి (కాంగ్రెస్‌), వి.గంగాధర్‌ గౌడ్‌ (టీఆర్‌ఎస్‌)ల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుండగా.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఉన్న సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ రిజ్వీ (ఎంఐఎం) పదవీకాలం మే ఒకటితో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషన్‌ వీటికి ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనెల 28న నోటిఫికేషన్‌ జారీ కానుంది.



మూడు స్థానాల్లో అవకాశం..

ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునే అవకాశం అధికార టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది. దాంతోపాటు హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటా స్థానాన్ని గెలుచుకునే సంఖ్యాబలం కూడా గులాబీ దళానికి ఉంది. కానీ తమ చేతిలో ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులను తమకే వదిలేయాలని టీఆర్‌ఎస్‌తో మిత్రపక్షంగా అవగాహన ఉన్న ఎంఐఎం కోరే అవకాశముందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. కనీసం ఒక స్థానమైనా ఎంఐఎంకు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. దీంతో మిగతా మూడు స్థానాల్లో అధికార పార్టీ నేతలకు పదవులు దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్సీ ఆశావహులు తమకు అవకాశమివ్వాలంటూ పార్టీ అధినేతకు విన్నవించే పనిలో పడ్డారు.



ఒకరికి రెన్యువల్‌ తప్పనిసరి!

టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన వి.గంగాధర్‌గౌడ్‌.. శాసనమండలి చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ పక్షాన చేరారు. మండలిలో టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌ ఎల్పీలో విలీనం చేయడంతో ఆయన ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగానే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తిరిగి ఎమ్మెల్సీగా అవకాశమిస్తారని భావిస్తున్నారు. మిగతా రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు, ఒక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవులపై గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎంఐఎంకు ఒక సీటు ఇస్తే.. ఏ కోటాలో స్థానాన్ని వదిలేసుకుంటారో స్పష్టత లేదు. దాంతో హైదరాబాద్‌కు చెందిన నేతలు స్థానిక సంస్థల కోటా స్థానం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు పార్టీలో తొలి నుంచీ కొనసాగుతూ పదవులు పొందని సీనియర్లు ఇప్పటికైనా తమకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతున్నారు.


వరంగల్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టికెట్‌ దక్కినట్టే దక్కి అవకాశం చేజారిన గుడిమల్ల రవికుమార్‌ ఈసారి రేసులో ఉన్నారని చెబుతున్నారు. ఆయనకు ప్రకటించిన టికెట్‌ను పలు కారణాలతో రద్దు చేసిన సమయంలోనే.. తగిన గుర్తింపు ఉండే పదవి ఇస్తామని రవికి కేసీఆర్‌ హామీ ఇచ్చారని అంటున్నారు. ఇక పార్టీ వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్‌ నాయకుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.సత్యనారాయణ, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యునిగా పనిచేసిన ఎర్రోల్ల శ్రీనివాస్‌ కూడా ఎమ్మెల్సీ ఆశావహుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి 7న నామినేషన్ల దాఖలుకు ఆఖరి గడువు కావడంతో.. ఆలోగా అభ్యర్థుల పేర్లు ఖరారుకానున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top