రుణమో...రామచంద్రా..!

రుణమో...రామచంద్రా..! - Sakshi


 సాక్షిప్రతినిధి, నల్లగొండ :రైతులను బ్యాంకర్లు నిండాముంచారు. రుణమాఫీ విషయంలో మీనమేషాలు లెక్కించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో నయాపైస రుణసాయం బ్యాంకుల నుంచి రైతులకు అందలేదు. మంగళవారంతో ఖరీఫ్ రుణాల సీజన్ ముగిసింది. అధికారిక సమాచారం మేరకు ఇక, బుధవారం నుంచి రబీ రుణాలు జారీ చేయాల్సి ఉంది. అయితే, ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీకి సంబంధించి మొదటివిడతగా జిల్లాకు విడుదలైన 633 కోట్ల రూపాయల్లో బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా జమకాలేదు. ఫలితంగా ఏ బ్యాంకూ రైతులకు కొత్త పంటరుణాలు ఇవ్వలేదు. సెప్టెంబరు మొదటివారం దాకా నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఈసారి సాగు జరుగుతుందో, లేదో అన్న సంశయమే ఉన్నది. తీరా సాగర్ నిండడంతో, నీరు విడుదల చేశారు. మెజారిటీ భూముల్లో వరిసాగు చేశారు.

 

 కానీ, అదునులో సాగు కుంటుపడడం, వ్యవసాయ ఖర్చులకు ప్రైవేటు అప్పులు చేయాల్సి రావడం రైతులకు భారంగా పరిణమించింది. దీని ఫలితం వరిసాగు విస్తీర్ణంపై పడింది. అన్ని రకాల పంటలు కలిపి ఈసారి 1.50లక్షల హైక్టార్లకు పైగానే సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలో జిల్లా వ్యవసాయశాఖ వరి, పత్తి, ఇతర పంటలు కలిపి కనీసం 6.50లక్షల హెక్టార్లు సాగవుతుందని అంచనా వేసింది. ఇందులో పత్తి 3లక్షల హెక్టార్లు, వరి 2లక్షల హెక్టార్లు, ఇతర పంటలు 1.50లక్షల హెక్టార్లు సాగు కావాల్సి ఉంది. ఈ పంటల సాగుకు గాను, జిల్లా క్రెడిట్‌ప్లాన్‌లో ఖరీఫ్ రూ.1226.80 కోట్ల పంట రుణాలు ఖరీఫ్‌లో అందివ్వాలని నిర్ణయించారు. అదే మాదిరిగా రబీలో రూ.525 కోట్లు రుణాలుగా ఇవ్వాల్సి ఉంది. అధికారిక సమాచారం మేరకు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో రూ.1226.80కోట్లకు గాను, ఏ బ్యాంకూ పంట రుణం ఇవ్వలేదు. ఫలితంగా రైతులకు నయాపైస పంట రుణం అందలేదు.

 

 ప్రభుత్వం ప్రకటించిన పంట రుణాలమాఫీలో భాగంగా ప్రతీ రైతుకు రూ.ఒక లక్షలో మొదటి విడతగా రూ.25వేలు మాఫీ కావాల్సి ఉంది. ఒక్కో రైతు ఖాతాలో ఈ మొత్తం జమైతే, బ్యాంకర్లు కొత్త రుణాలు ఇస్తారని అధికారులు ముందు నుంచీ ప్రచారం చేశారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి కే జిల్లాకు రుణమాఫీ సొమ్ము (25శాతం) రూ.633కోట్లు ట్రెజరీకి జమైంది. ట్రెజరీ నుంచి బ్యాంకుల ప్రధానశాఖలకు, వాటి నుంచి ఆయా బ్రాంచ్‌లకు సొమ్ములు చేరాలి. కానీ, ఈ మొత్తం బ్యాంకులకు జమ కాకపోవడంతో బ్యాంకర్లూ పంట రుణాలు ఇవ్వలేదు. దీంతో నయా పైసరుణం ఇవ్వకుండానే ఖరీఫ్ సీజన్ మంగళవారంతో ముగిసింది. వ్యవసాయశాఖ అధికారిక గణాంకాల మేరకు మొత్తం 6.50లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను 4,99,789హెక్టార్లలో మాత్రమే ఆయా పంటలు సాగయ్యాయి. 2లక్షల హెక్టార్లలో సాగు కావాల్సిన వరి కేవలం 1,65,166 హెక్టార్లకే పరిమితమైంది. ఒక్క పత్తి పంట మాత్రం 3లక్షల హెక్టార్లకుగాను దాదాపు పూర్తయ్యి, 2,99,239హెక్టార్లలో సాగైంది. వరి ఏకంగా 35వేల హెక్టార్లలో తగ్గిపోయింది. వర్షాభావ పరిస్థితులకు తోడు, సకాలంలో పంట రుణాలు అందకపోవడం రైతులకు శాపంలా మారింది. రైతులు తమ ప్రైవేటు అప్పులు తీర్చడానికి ఇప్పుడు రబీ పంటరుణాలపై ఆశలు పెట్టుకోవడం మినహా మరోమార్గం కనిపించడం లేదు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top