టీఆర్‌ఎస్‌లో ‘సమితి’ పోరు

టీఆర్‌ఎస్‌లో ‘సమితి’ పోరు - Sakshi


కొత్త చిక్కులు తెచ్చిన రైతు సమన్వయ సమితులు

వలస నాయకులకు చెక్‌ పెట్టేందుకు పాత నేతల వ్యూహాలు

పోటీగా జాబితాలు తయారు..  

అనుచరులతో చర్చించి తుదిరూపు ఇస్తున్న ఎమ్మెల్యేలు




సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గ్రామ రైతు సమన్వయ సమితుల సభ్యుల జాబితాల తయారీ బాధ్యత ఎమ్మెల్యేలదే కావడం కొత్త చిక్కులకు ఆస్కారం ఇస్తోంది. పార్టీలోకి వల సొచ్చిన శాసనసభ్యులు ఉన్న చోట వారు తయారు చేసిన జాబితాలను ముందు నుంచీ పార్టీలో కొనసాగుతున్న నాయకులు విభేదిస్తున్నారు. ఆ కూర్పుకు విరుగుడుగా గ్రామ సభలు నిర్వహించి అధికారికంగా ఓ జాబితాను సిద్ధం చేసి నేరుగా కలెక్టర్‌ కార్యాలయానికి పంపుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో ఇదే తరహాలో కమిటీల ఏర్పాటులో రెండు జాబితాలు రూపుదిద్దుకోవడం అధికార యంత్రాంగానికి సంక్లిష్టంగా మారింది.



అంతర్గత సంప్రదింపులతో..

రైతు సమన్వయ సమితులను గ్రామ సభల్లో ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఈ తంతు పూర్తి చేసి జాబితాను జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా ప్రభుత్వానికి పంపాలని తెలిపింది. అయితే, గ్రూపు తగాదాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు గ్రామసభల నిర్వహణకు ఆసక్తి చూపడం లేదు. టీడీపీ, కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు గ్రామసభల జోలికి వెళ్ల కుండా.. తమ అనుచరులతో సంప్రదింపులు జరిపి జాబితాలకు తుదిరూపు ఇస్తున్నారు. గ్రామ సమన్వయ సమితుల ఏర్పాటుకు ఇంకా ఒక్క రోజే గడువు మిగిలి ఉన్నా.. సగం కమి టీలు కూడా కొలిక్కి రాలేదు.



 చాలా చోట్ల గుట్టుగా జాబితాలను తయారు చేసినా చివరి రోజే వీటిని అధికారులకు అప్పగించాలని ఉన్నారు. ఏకపక్షంగా జాబితాలు తయారు చేస్తే విమర్శలు వెల్లువెత్తుతాయని భావించి తమ ఆధిపత్యం ఉన్న పల్లెల్లో గ్రామసభలతో మమ అనిపిస్తున్నారు. ఈ క్రమంలో వలస నేతల పెత్తనానికి చెక్‌ పెట్టేందుకు పార్టీలో ముందు నుంచీ ఉన్న నేతలు కొత్త ఎత్తుగడ వేశారు. తమ ఏలుబడిలో ఉన్న గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి సమితులను ప్రకటిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ గ్రామ పంచాయతీ మినిట్స్‌ బుక్‌లో నమోదు చేస్తున్నారు. అనంతరం జాబితా తీర్మానం ప్రతులను కలెక్టర్‌ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఈ తరహాలో వికారాబాద్‌ జిల్లా నవాబుపేట, చేవెళ్ల మండలాల పరిధిలోని పది గ్రామ పంచాయతీలు సమితులను గ్రామసభల్లో ఖరారు చేశాయి.



యంత్రాంగానికి తలనొప్పులు

అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు సమన్వయ సమి తులపై ప్రభావం చూపుతుండటం యంత్రాంగానికి చికాకు తెప్పిస్తోంది. కమిటీల ఎంపిక పూర్తిగా ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకు నడుచుకోవాలని ప్రభుత్వ పెద్దలు అంతర్గత సంకేతాలు పంపగా.. తాజా పరిణామాలతో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందోననే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ప్రస్తుతా నికి ఈ పంచాయతీ గులాబీ గూటికే పరిమితమైనా.. విపక్షాలు కూడా ఇదే విరుగుడు మంత్రాన్ని పఠిస్తే సమితుల ఏర్పాటు క్లిష్టంగా మారే అవకాశముం దని అధికార వర్గాలు అంటున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top