టీఆర్‌ఎస్ తీర్మానాలు ఖరారు

టీఆర్‌ఎస్ తీర్మానాలు ఖరారు - Sakshi


క్యాంపు కార్యాలయంలో  సీఎం కేసీఆర్ సుదీర్ఘ భేటీ

ప్లీనరీ కోసం 12 తీర్మానాలు రెడీ

{పభుత్వ పథకాల ప్రచారానికే ప్రాధాన్యం

 


హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటయ్యాక నిర్వహిస్తున్న పార్టీ తొలి ప్లీనరీ విషయంలో అధికార టీఆర్‌ఎస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది. పది నెలలుగా ప్రభుత్వ పని తీరును కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్లీనరీని వేదికగా మార్చుకోవాలని భావిస్తోంది. ఈ దిశగా ఈ నెల 24న ఎల్బీ స్టేడియంలో 36 వేల మంది ప్రతినిధులతో జరిగే ప్లీనరీలో ప్రవేశపెట్టే తీర్మానాలపై భారీ కసరత్తు చేసింది. చివరకు సోమవారం రాత్రి సుదీర్ఘ తర్జనభర్జనల తర్వాత 12 తీర్మానాలను ఖరారు చేసింది. ప్లీనరీ కోసం నియమించిన ఏడు కమిటీల్లో ఒకటైన తీర్మానాల కమిటీకి పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు(కేకే) నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిటీ రూపొందించిన తీర్మానాలను పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇప్పటికే రెండుసార్లు పరిశీలించి పలు మార్పుచేర్పులు సూచించారు. ఆదివారం రాత్రి సుదీర్ఘంగా చర్చించినా వాటికి తుదిరూపు రాకపోవడంతో సోమవారం రాత్రి సీఎం క్యాంపు కార్యాలయంలో కమిటీ సభ్యులతో కేసీఆర్ మరోసారి భేటీ అయ్యారు.



పార్టీకి, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే విధంగా కనీసం 24 తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశ పెట్టాలన్న చర్చ తొలుత జరిగింది. అయితే సమయాభావ సమస్య తలెత్తుతుందన్న ఆలోచనతో వాటిని తగ్గించాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలపై తీర్మానాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. విద్యుత్ రంగంలో సమస్యలు, మిగులును సాధించే లక్ష్యాన్ని వివరిస్తూ ఓ తీర్మానాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలపై తీర్మానాలు ఉంటాయి. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచితే విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొనవచ్చని, అందుకే వాటికి ప్రాధాన్యమిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తీర్మానాల ఖరారులో ఇక ఆలస్యం జరగరాదన్న ఉద్దేశంతోనే సోమవారం మళ్లీ సమావేశమై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాత్రి చాలా సేపటివరకు జరిగిన ఈ భేటీలో 12 తీర్మానాలకు తుదిరూపునిచ్చినట్లు సమాచారం. అయితే మంగళవారం రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి వద్ద మరోసారి కూలంకషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top