ఇక గులాబీ గుబాళింపు

ఇక గులాబీ గుబాళింపు - Sakshi


కార్యకర్తల బాగోగులపై దృష్టి పెట్టనున్న కేసీఆర్‌

► వరంగల్‌ సభ తర్వాత కార్యాచరణ

► రూ.5 లక్షలలోపు అభివృద్ధి పనుల అప్పగింత

► నామినేటెడ్‌ పోస్టుల భర్తీ.. పథకాల ప్రచారంలో భాగస్వామ్యం




సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో నూతనోత్సాహం వెల్లివిరియనుందా... చోటా, మోటా నేతల్లో గూడుకట్టుకున్న నిరాసక్తత తొలగిపోనున్నదా.. అంటే అవుననే అంటున్నాయి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) వర్గాలు. పార్టీ 16వ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అతి ముఖ్యమైన వ్యవసాయ విధానాన్ని ప్రకటించినప్పుడు ప్రతినిధుల నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. కార్యకర్తల్లోని నిస్తేజం ఆ పార్టీ అధినాయకత్వంలో గుబులు రేపింది. ఈ నేపథ్యంలో దిద్దుబాటుకు అధినేత శ్రీకారం చుట్టారు.


అధికారంలో ఉన్న ఈ మూడేళ్ల సమయాన్ని పాలనను గాడిలో పెట్టేందుకు వెచ్చించి పార్టీపై దృష్టి సారించలేదని రెండో సెషన్‌ ముగింపు ప్రసంగంలో కేసీఆర్‌ పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో జరగనున్న టీఆర్‌ఎస్‌ 16వ ఆవిర్భావ సభ తర్వాత పార్టీ వ్యవహారాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. ‘అన్ని వర్గాలకు సంక్షేమ ఫలితాలు అందిస్తూనే మరో వైపు పార్టీ క్యాడర్‌ గురించి సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. ప్లీనరీ సాక్షిగా శ్రేణులకు ఆయన మాట కూడా ఇచ్చారు. కార్యకర్తలను ఆదుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రణాళిక రచించారు’ అని పార్టీ సీనియర్‌ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు.



పార్టీ యంత్రాంగం బలోపేతానికి చర్యలు

బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసింది. కుల వృత్తుల వారీగా కార్యక్రమాలు తీసుకుంటోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు రెండు పంటలకు రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇది తమకు మరోమారు అధికారాన్ని కట్టబెట్టే పథకమని భావిస్తోంది. ఈ క్రమంలో సంక్షేమ పథకాలకు గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించాలంటే పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసుకోవడం మినహా మరో మార్గం లేదన్న ఆలోచనకు వచ్చారని అంటున్నారు. దీనికి అనుగుణంగా ఉద్యమంలో పనిచేసిన కార్యకర్తలకు బాసటగా  నిలిచేందుకు రూ.5 లక్షల లోపు అభివృద్ధి పనులను నామినేషన్‌ పద్ధతిన అప్పజెప్పేందుకు రంగం సిద్ధమవుతోంది.


గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, తదితర పనులను పార్టీ కింది స్థాయి నాయకులకు, కార్యకర్తలకు నామినేషన్‌ విధానంలో ఇవ్వనున్నారు. దీనికితోడు ఎమ్మెల్యేలకు ఉండే నియోజకవర్గ అభివృద్ధి ఫండ్, ఎమ్మెల్సీలు, ఎంపీల ఫండ్‌తో గ్రామాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సూచించారని చెబుతున్నారు. ఈ పనులను  చేపట్టడంలో భాగంగా పార్టీ క్యాడర్‌ను పరిగణనలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీలు, ఎంపీల ఫండ్‌ను స్థానిక ఎమ్మెల్యే సమన్వయంతో వినియోగిస్తారు. పార్టీ యంత్రాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంలో ఈ నిర్ణయం ఉపకరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.



ఉద్యమంలో ఉన్న కార్యకర్తలకు గుర్తింపు

ఉద్యమ సమయంలో చురుగ్గా పనిచేసి, ఈ మూడేళ్లలోనూ ఎలాంటి పదవులు దక్కనివారిని గుర్తించి త్వరలో నామినేటెడ్‌ పోస్టులు ఇచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని సమాచారం. గ్రామ, మండల స్థాయిలో చురుగ్గా ఉండే కార్యకర్తలకు పదవులు ఇవ్వటం వల్ల ప్రభుత్వ పథకాల గురించి విస్తృత ప్రచారం కల్పించవచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతో కలసి ఉద్యమ కాలంలో పనిచేసినవారిని గుర్తించే పనిలో ఉన్నారని తెలిసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న జరిగే వరంగల్‌ బహిరంగసభ తర్వాత క్యాడర్‌ లో కొత్త ఉత్సాహం నింపే పనులు మొదలవుతాయని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top