కదులుతున్న గులాబీ దండు


- నేడు హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ

- జిల్లా నుంచి భారీ జన సమీకరణకు ఏర్పాట్లు

- రెండు లక్షల మంది టార్గెట్

- ఆర్టీసీ బస్సుల వినియోగం

- ఏర్పాట్లపై జిల్లా నేతలకు మంత్రి హరీశ్ సూచనలు

సాక్షి, సంగారెడ్డి:
టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభకు జిల్లా నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివెళుతున్నాయి. ఈ సభ సోమవారం హైదరాబాద్‌లో జరగనుంది. ప్లీనరీ అనంతరం నిర్వహిస్తున్న సభను విజయవంతం చేసేందుకు జిల్లాలోని పార్టీ నాయకత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సొంత జిల్లా కావడంతో జిల్లా నాయకత్వం జనసమీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది.



రెండు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను నేతలు చేపట్టారు. పార్టీ శ్రేణుల తరలింపు, జనసమీకరణ తదితర అంశాలపై జిల్లా మంత్రి హరీశ్ రావు పార్టీ జిల్లా అధ్యక్షులు మురళీధర్‌యాదవ్, ఎమ్మెల్యేలతో ఆదివారం చర్చించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జనాన్ని సమీకరించాలని సూచించినట్లు సమాచారం. ఆ వెంటనే జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌యాదవ్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఏర్పాట్లపై సమీక్షించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుపెన్నడూలేని విధంగా పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టి, సభను విజయవంతం చేస్తామన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. జనాన్ని తరలించేందుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను సమకూర్చుకున్నట్టు చెప్పారు. జిల్లాలోని ఆర్టీసీ బస్సులతోపాటు పొరుగున ఉన్న కర్ణాటక బస్సులను సైతం వినియోగించుకోనున్నారు.



బీదర్ డిపోకు చెందిన 30 బస్సులను జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నాయకులు సమకూర్చుకున్నట్టు తెలిపారు. ఇవే కాకుండా పెద్ద సంఖ్యలో ప్రైవేటు వాహనాలను సైతం బుక్ చేశామని, నియోజకవర్గానికి 200 చొప్పున వాహనాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం మూడువేల మంది మహిళలను బహిరంగ సభకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు.



పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జనసమీకరణకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలిపారు. సభకు హాజరయ్యే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల ప్లీనరీ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం వచ్చినట్లు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top