విద్యుత్ మంటలు


 సాక్షి ప్రతినిధి, నల్లగొండ  :మాటలు చేతలయ్యాయి... కొద్దిరోజులుగా టీఆర్‌ఎస్, టీడీపీ నేతల మధ్య సాగుతున్న విమర్శలపర్వంలో ‘విద్యుత్’ మంటలు ఎగసిపడ్డాయి. తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమంటూ ఆపార్టీ జిల్లా కార్యాల యంపై టీఆర్‌ఎస్ శ్రేణులు దాడిచేసిన ఘటన హల్‌చల్ సృష్టించింది. దీంతో మంగళవారం ఉదయం 11 గంటల వరకు ప్రశాంతంగా ఉన్న రాజ కీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీఆర్‌ఎస్ కార్యకర్తల హంగామాకు తోడు అంతకుముందే కలెక్టరేట్ వద్ద బీజేపీ నేతల ఆందోళనలు, ర్యాలీలు, ఆ తర్వాత టీడీపీ నేతల రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు... విమర్శలు, ప్రతివిమర్శలు... హెచ్చరికలు, ప్రతి హెచ్చరికలు...అన్నింటికి తోడు జిల్లా బంద్‌కు టీడీపీ పిలుపు..  వెరసి రైతు పేరిట పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడ ఏ మలుపు తిరుగుతుందో, బుధవారం జిల్లాలో ఏం జరగనుందో అనే ఉత్కంఠ  నెలకొంది.

 

 చంద్రబాబే కారకుడంటూ....

 తెలంగాణలో విద్యుత్ సంక్షోభంపై జరుగుతున్న చర్చను చంద్రబాబుపైకి మళ్లించే యోచనలో టీఆర్‌ఎస్ నాయకత్వం రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణకు విద్యుత్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ టీఆర్ ఎస్ శ్రేణులు అన్ని జిల్లాల్లో బాబు దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించాయి. అయితే, ఆ ఆందోళన జిల్లాలో మరో మలుపు తిరిగింది. చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వెళ్లిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఏకంగా టీడీపీ జిల్లా కార్యాలయానికే నిప్పు పెట్టారు. చంద్రబాబు డౌన్ డౌన్... జెతైలంగాణ అని నినాదాలు చేస్తూ కార్యాలయంలోనికి వెళ్లి కుర్చీలు, లైట్లు, కిటికీలు పగులగొట్టారు. కొందరు కార్యకర్తలు కుర్చీలు, ఫ్లెక్సీలను గుట్టగా వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. రాళ్లతో దాడి చేశారు. తెలంగాణకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడన్న ఆగ్రహంతో ఊగిపోయిన గులాబీ సేన చేసిన హల్‌చల్ ఒక్కసారిగా జిల్లాలో రాజకీయ వేడిని పుట్టించింది. అయితే, అప్పటికే జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి జగదీష్‌రెడ్డి కూడా అంతకుముందే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణలో విద్యుత్ కొరతకు టీడీపీ అధినేత అవలంబిస్తున్న వైఖరే కారణమని ఆరోపించారు. ఆ వెంటనే పార్టీ శ్రేణులు ఆందోళనకు వెళ్లి టీడీపీ కార్యాలయంలో ఫర్నిచర్ దహనం చేయడం చర్చనీయాంశమైంది.  

 

 ‘దేశం’ నిరసన

 ఈ ఘటన అనంతరం విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు కూడా స్పందించాయి. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్‌ల నేతృత్వంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. పార్టీ జిల్లా కార్యాలయం నుంచి నేరుగా క్లాక్‌టవర్ సెంటర్‌కు వెళ్లి అక్కడ ఆందోళన నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. పార్టీ జిల్లా కార్యాలయంపై జరిగిన దాడి రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్లడంతో వారు కూడా వెంటనే స్పందించారు. ఈ దాడి అమానుషమని, తాము కూడా తెలంగాణ భవన్‌ను భూస్థాపితం చేస్తామని ఆ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఘాటుగా స్పందించారు. తాము బుధవారం నల్లగొండకు వెళతామని, జిల్లా బంద్ నిర్వహిస్తామని చెప్పడంతో నల్లగొండలో కూడా పార్టీ జిల్లా నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బుధవారం జిల్లాబంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ బంద్ నుంచి ఆర్టీసీ బస్సులు,  అత్యవసర సేవలను మినహాయిస్తున్నట్టు వారు ప్రకటించారు.

 

 దిమ్మెలు పగలగొడతాం... ప్రతిదాడులు చేస్తాం

 టీఆర్‌ఎస్, టీడీపీ శ్రేణులు దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జిల్లా కార్యాలయంపై దాడి చేసిన అనంతరం టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తన వైఖరిని మార్చుకోకపోతే గ్రామాల్లో టీడీపీ దిమ్మెలను కూల్చివేస్తామని ప్రకటించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఆ తర్వాత టీడీపీ నేతలు విలేకరులతో మాట్లాడుతూ తాము కూడా దాడులను చూస్తూ ఊరుకోబోమని, ప్రతి దాడులు చేస్తామని, టీఆర్‌ఎస్ దిమ్మెలు తాము కూడా కూల్చివేస్తామని హెచ్చరించారు. మరోవైపు టీడీపీ రాష్ట్ర నాయకత్వం జిల్లాకు రానున్న నేపథ్యంలో బుధవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

 

 కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

 మరోవైపు, మంగళవారం భారతీయ జనతా పార్టీ నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం కూడా ఉద్రిక్తతకు దారి తీసింది. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత డాక్టర్. కె.లక్ష్మణ్ నేతృత్వంలో కరెంటు కోతలకు నిరసనగా ఆ పార్టీ ఆందోళన నిర్వహించిన సమయంలో కొందరు కార్యకర్తలు కలెక్టరేట్‌లోనికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత కూడా మరికొందరు అదే ప్రయత్నం చేసినా పోలీసులు విఫలం చేశారు. మొత్తంమీద ఒకేరోజు రైతుల కోసం మూడు పార్టీలు నిర్వహించిన ఆందోళనలు, ప్రతి ఆందోళనలతో జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

 144 సెక్షన్ విధింపు

 జిల్లా బంద్‌కు టీడీపీ నేతలు పిలుపునివ్వడంతో ముందు జాగ్రత్తగా పోలీసులు జిల్లా కేంద్రంలో 144 సెక్షన్  విధిస్తున్నట్టు ప్రకటించారు. అయితే, టీడీపీ బంద్ నిర్వహణ సమయంలో జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ ఎలా స్పందిస్తుంది... టీడీపీ నేతలు బంద్ సమయంలో ఎలా వ్యవహరించబోతున్నారు అనే కోణంలో పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లకు పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. మొత్తం మీద విద్యుత్ లేక అల్లాడిపోతున్న రైతాంగానికి సాంత్వన చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించాల్సిన జిల్లా రాజకీయ యంత్రాంగం... తమ ప్రయోజనాల కోసం ముష్టియుద్ధాలకు పాల్పడడం, ఒకరిపై ఒకరు కావాలని విమర్శలు చేసుకుంటూ అసలు జరగాల్సిన ప్రయోజనాన్ని పక్కకు పడేస్తున్నారనే విమర్శలు జిల్లా ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి.

 

 25 మందిపై కేసు..అరెస్టు, విడుదల

 నల్లగొండ క్రైం : టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 25మంది టీఆర్‌ఎస్ నాయకులపై కేసు నమోదైంది.  వారిని  టుటౌన్ పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కేసు నమోదైన వారిలో దుబ్బాక నర్సింహారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, వెంకన్న, విజయ్ తదితరులున్నారు.  



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top