ఈసీ నిఘాకు ‘చెక్’

ఈసీ నిఘాకు ‘చెక్’

  •      కొత్త ట్రిక్కులతో లెక్కకు చిక్కకుండా ఖర్చు

  •      మే 16 తర్వాతి తేదీతో చెక్కులు జారీ

  •      ఏటీఎంల ద్వారా కార్యకర్తలకు క్యాష్  

  •      ఫైనాన్షియర్లు, వడ్డీ వ్యాపారులతో నగ దు పంపిణీ

  •      ఇదీ అభ్యర్థుల లె‘టెస్ట్’ వ్యూహం

  •  అధికారుల నిఘా నీడ పడ కుండా నీటుగా దగా చేసేస్తున్నారు ఎన్నికల్లో పోటీ  చేస్తున్న అభ్యర్థులు. శతకోటి దరిద్రాలకు అనంత ‘కోటి’ ఉపాయాలు అన్న నానుడిని నిజం చేస్తూ.. కొత్త పద్ధతులు, లేటెస్ట్ ట్రిక్కులతో నగదు చిక్కులను అధిగమిస్తున్నారు. పోస్ట్‌డేటెడ్ చెక్కులు.. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల ఏటీఎంలు.. ప్రైవేటు పైనాన్షియర్లు.. వడ్డీ వ్యాపారులతో ఈసీ లెక్కకు చిక్కకుండా ఎన్నికల ఖర్చును ద్వితీయ శ్రేణి నాయకగణానికి చాకచక్యంగా అందించేస్తున్నారు. ఇదీ రాబోయే కాలంలో కాబోయే ప్రజాప్రతి‘నిధుల’ ‘నయా’వంచన.

     

     సాక్షి, సిటీబ్యూరో : బరిలో ప్రత్యర్థులతో పోటీ పడుతున్న అభ్యర్థులు.. ఎలక్షన్ కమిషన్‌తోనూ పరోక్షంగా పోరాటం చేస్తున్నారు. ఒకవైపు కట్టలు తెగుతున్న నోట్ల ప్రవాహానికి ఈసీ డేగకన్నుతో అడ్డుకట్ట వేస్తుంటే.. మరోపక్క అభ్యర్థులు అధికారుల కళ్లుగప్పి పలు మార్గాల ద్వారా కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకగణం, ఓటర్లకు నోట్ల బదిలీ చేసేస్తున్నారు.



    వాహనాల్లో నోట్ల కట్టలు తరలిస్తే పోలీసు తనిఖీల్లో అడ్డంగా బుక్కయిపోతామన్న ఆందోళనతో ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన పలు బ్యాం కుల ఏటీఎంలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ద్వారా నోట్ల పంపిణీ కానిచ్చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు ఇప్పటికిప్పుడు నగదు అందుబాటులో లేకపోవడంతో తమ సొంత స్థిర ఆస్తులను తనఖా పెట్టి అధిక వడ్డీలకు ప్రైవేటు ఫైనాన్షియర్ల వద్ద అప్పులు చేసినట్లు సమాచారం.



    నియోజకవర్గం పరిధిలోని స్థానిక వడ్డీ వ్యాపారులను ఏ ప్రాంతం వారికి అక్కడి తమ ద్వితీయ శ్రేణి నా యకగణానికి చెప్పిన మోతాదులో నగదు అందజేయాలని మౌఖిక ఆదేశాలిస్తున్నట్లు తెలిసింది. దీంతో రోజు వారీగా కార్యకర్తలకు విందు వినోదాలు, వాహనాల ని ర్వహణ, అద్దెలు, ప్రచారంలో పాల్గొనే వారికి దినసరి భ త్యాలు వడ్డీ వ్యాపారులే అందజేస్తున్నారు. డివిజన్ల వారీ గా ఇలా చేసిన ఖర్చును తమ సొంత ఖర్చు కింద చూపే అవకాశం లేకుండా అభ్యర్థులు జాగ్రత్త పడుతున్నారు.

     

    నగదు కేరాఫ్ ఏటీఎం


     

    ఇక ద్వితీయ శ్రేణి నాయకుల అకౌంట్లలో రోజువారీ ఖర్చులకు నిర్ణీత మోతాదులో నగదు జమ చేసి వారి ఏటీఎం కార్డుల ద్వారా ఎక్కడికక్కడే డబ్బు డ్రా చేసుకోవాలని మరికొందరు నాయకులు సూచిస్తున్నారు. ఇలా డ్రా చేసిన మొత్తాన్ని ప్రచార ఖర్చుల కింద వినియోగించుకోవాలని చెబుతున్నారు. ఈ మొత్తం రూ.50 వేలు దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించింది. బ్యాంకర్లతో సమావేశ మైన అధికారులు 50,000 కంటే అధికంగా ఉండే లావాదేవీల వివరాలు తమకు అందించాలని కోరింది. నెలరోజులుగా పార్శిళ్ల సంఖ్య రెట్టింపైన నేపథ్యంలో పోస్టు ఆఫీసులకు, కొరియర్ సర్వీసులనూ అప్రమత్తం చేశారు.

     

    చెక్కు భద్రం

     

    అధికారులు బ్యాంకు లావాదేవీలపైనా కన్నేయడంతో నగదు పంపిణీ కంటే చెక్ ఇవ్వడమే బెటర్ అని అభ్యర్థులు భావిస్తున్నారు. ‘మీ అవసరాలకు కావాల్సిన డబ్బును మీరే ఖర్చుపెట్టుకోండి’ అంటూ ద్వితీయ శ్రేణి నాయకులను పురమాయిస్తున్నారు. ఆ మొత్తానికి చెక్కు ఇస్తున్నారు. అదీ మే 16వ తేదీ తరవాత తేదీనే చెక్కుపై రాస్తుండటం గమనార్హం. ఇలా చేస్తే ఈసీ నిబంధనలు వర్తించవని పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు.



    ‘నెలరోజుల ఖర్చులు కాస్త ఎక్కువైనా సరే వెనుకాడకండి.. చెక్కులిచ్చేస్తాం.. ప్రచారం కానీయండి’ అంటూ ఓ మోస్తరు స్థితిమంతులైన నాయకులను అభ్యర్థులు అభ్యర్థిస్తూ ప్రచారం కానిచ్చేస్తున్నారు. మహిళా సంఘాల అకౌంట్లను, బ్యాంకుల్లో రూ.50 వేలకు మించి చేస్తున్న నగదు డిపాజిట్, విత్‌డ్రా వ్యవహారాలను ఎన్నికల సంఘం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న విషయం తెలుసుకున్న అభ్యర్థులు ఈ రూటును ఎంచుకోవడం విశేషం.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top