చదవాలంటే నడవాల్సిందే..

చదవాలంటే నడవాల్సిందే.. - Sakshi


పై చదువులకోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్న గిరిజన విద్యార్థులు

మెదక్‌రూరల్: చదువుపై మక్కువతో గిరిజన విద్యార్థులు కిలో మీటర్ల మేర నడుస్తున్నారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ..పాఠశాలకు సమయానికి చేరుకోవాలనే ఆత్రుతతో కాలినడకన పరుగులు పెడుతున్నారు. తం డాల్లో ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్న గిరిజన విద్యార్థులు పై చదువులు చదవాలంటే కిలో మీటర్ల పాదయాత్ర తప్పడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా..గిరిజన తండాలకు రవాణా సౌకర్యం మాత్రం కల్పించడం లేదు. దీంతో గిరిజన విద్యార్థులు కిలో మీటర్ల మేర దూరం నడుస్తూ విద్యాభ్యాసం చేస్తున్న మెదక్ మండలంలోని గిరిజన విద్యార్థుల చదువుల గోసపై సాక్షి కథనం..


 మెదక్ మండలం హవేళి ఘణాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిధిలో హవేళి ఘణాపూర్ తండా,  శేరిగడ్డ తండా, భరతమాత తండా, ఉప్పుతండా, బద్యాతండా, ఔరంగాబాద్ తండాలున్నాయి. శుక్లాల్‌పేటతండా, సుల్తాన్‌పూర్ తండా, శాలిపేట,  బి.భూపతిపూర్, అవుసులపల్లి, బ్యాతోల్ లింగ్సాన్‌పల్లి గ్రామాలున్నాయి. ఆయా తండాలతోపాటు గ్రామాలలో ప్రాథమిక విద్య పూర్తిచేసుకున్న విద్యార్థులు సుమారు 300మంది  హవేళిఘణాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వస్తుంటారు.  గ్రామాలకు, తండాలకు రవాణా సౌకర్యం లేక పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన వస్తుంటారు. కొద్దిమంది మాత్రం సైకిళ్లపై వస్తుంటారు. మెదక్ మండలంలోని అన్ని మారుమూల గ్రామాలు, తండాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.  దీంతో వర్షం కురిసినా...ఎండలు మండిన విద్యార్థులు నానా పాట్లు పడుతూ పాఠశాలకు చేరుకుంటున్నారు. ఇక విద్యార్థినులు అవస్థలు అన్నిఇన్నీ కావు. కిలో మీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో అంతదూరం నడవకలేక మధ్యలోనే మానేస్తున్నారు.


 ప్రచారమే తప్ప..కనీస వసతులు లేవు

ప్రభుత్వ పాఠశాలలకే తమ పిల్లలను పంపాలంటూ  బడిబాట కార్యక్రమంలో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం మారుమూల గ్రామాలు, గిరిజన తండాల  విద్యార్థుల సౌకర్యార్థం రవాణా సౌకర్యం కల్పించడం లేదు. మరోవైపు ప్రైవేట్ విద్యా సంస్థలు  బస్సులను మారుమూల గ్రామాలకు, తండాలకు నడిపిస్తుండటంతో  పోషకులు తమ పిల్లలను  ప్రైవేట్ పాఠశాలలకు పంపేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో అప్పులపాలవుతున్నప్పటికీ పిల్లల భవిష్యత్‌కోసం భారం మోస్తున్నారు. ప్రభుత్వం మారుమూల గ్రామాలకు, తండాలకు రవాణా సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.


ఆరుకిలోమీటర్లు నడుస్తున్నా..

హవేళిఘణాపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో 7వ తరగతి చదువుతున్నా. తండా నుంచి ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం నడుస్తూ బడికి వస్తున్నా. వర్షంపడితే తడిసిపోవాల్సి వస్తోంది. పుస్తకాలు కూడా తడిసిపోతున్నాయి. ఇబ్బందులుపడాల్సి వస్తోంది. -గణేష్, 7వ తరగతి, ఔరంగాబాద్‌తండా


అలసి పోతున్నాం..

హవేళిఘణాపూర్‌లోని జెడ్పీహెచ్‌ఎస్‌లో 6వ తరగతి చదువుతున్నా. సమయానికిపాఠశాలకు చేరుకోవాలని ఉదయాన్నే బయల్దేరినప్పటికీ  పరుగులు పెట్టాల్సి వస్తోంది. పాఠశాల నుంచి ఇంటికి ఆరు కిలోమీటర్లు. దీంతో కాళ్లు నొప్పులు పెడుతున్నాయి. ఇంటికి వెళ్లే సరికి అలసి పోతున్నాం.  ప్రభుత్వం మాలాంటి వారికోం  స్కూల్ బస్సులు వేస్తే బాగుంటుంది.

-అంబిక, 6వ తరగతి, ఔరంగాబాద్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top