బదిలీ!

బదిలీ!


ఉపాధ్యాయులను బలి చేసే రీతిలో బది‘లీలలు’.. ఈ నెల 7 నుంచి 19 వరకు జరిగిన ఉపాధ్యాయుల రేషనలైజేషన్, పదోన్నతులు, బదిలీ కౌన్సెలింగ్  అంతా గందరగోళం.. పేరుకే పారదర్శకం..  అడుగడుగునా లాలూచీల పర్వం. తిలాపాపం తలా పిడికెడులా... నిజాయితీగా పనిచేయాల్సిన విద్యా శాఖతో పాటు... ప్రశ్నించాల్సిన ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ అక్రమ బదిలీల్లో భాగస్వాములు కావడం గమనార్హం. ఒకటా రెండా... తవ్వినకొద్దీ ‘లీలలు’ బయట పడుతున్నాయి.    

 

- అక్రమాలు, లాలూచీలు అన్నీఇన్నీకావు..

- పేరుకే పారదర్శకం.. అడుగడుగునా అవినీతే..

సాక్షి టాస్క్‌ఫోర్స్:
బదిలీలు, పదోన్నతులు ప్రారంభమయ్యే నాటికే రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తిచేసి సమాచారం అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ అధికారులు మాత్రం దానికి విరుద్ధంగా ఏ రోజు ఏ కేడర్ బదిలీలు జరిగితే అదే రోజు పోస్టులు అలాట్ చేశారు. దీంతో ఏ పాఠశాలలో ఏ పోస్టు ఉందో తెలియక ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. కాగా రేషనలైజేషన్‌లో సర్‌ప్లెస్ అయిన పోస్టులు, అలాట్ అయిన పోస్టు వివరాలు ఇప్పటి వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో లేవు.



- ఈ నెల 8న జరిగిన ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల్లో సిద్దిపేట మండలంలో పనిచేసే ఒక మహిళా స్కూల్ అసిస్టెంట్‌కు రామాయంపేట మండలంలోని ఓ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంగా పదోన్నతి కల్పించారు. కానీ, ఆమె అంతర్ జిల్లా బదిలీల్లో భాగంగా 28-08-2003 నాడు మెదక్ జిల్లాకు వచ్చారు. నిజానికి ఆమె 12-11-2000లో ఉద్యోగంలో చేరారు. ఈ తేదీని ప్రమోషన్‌కు ప్రాతిపదికగా తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం.

- చేగుంట మండలంలో పనిచేస్తున్న ఓ ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం స్పౌస్ కేటగిరీలో తూప్రాన్ మండలానికి బదిలీ అయ్యారు. నిజానికి ఆమె భర్త కూడా అదే మండలంలో ఆమె పాఠశాలకు 5 కిలో మీటర్ల దూరంలో పనిచేస్తున్నాడు. కానీ, ఆమె అక్రమ బదిలీ వల్ల భర్తకు 50 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది.

- సంగారెడ్డి మండలంలో ఎల్పీ తెలుగుగా పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు పటాన్‌చెరు మండలానికి స్పౌస్ కేటగిరీలో బదిలీ అయ్యారు. భర్త సంగారెడ్డి మండలంలోనే పనిచేస్తున్నా... ఆమె మాత్రం 25 కిలో మీటర్ల దూరం వెళ్లారు. ఈ కేటగిరీలో ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో!

 

ఎస్జ్జీటీలోనూ అదే తంతు...

ఎస్జీటీల బదిలీల్లోనూ అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట డివిజన్‌లోని అన్ని మండలాల్లో ఖాళీలు భర్తీ అయినట్లు మొదట ప్రకటించినప్పటికీ, ఖాళీలు చూపని అనేక పాఠశాలలకు ఉపాధ్యాయులను గుట్టుచప్పుడు కాకుండా బదిలీ చేశారు. వెల్దుర్తి, పెద్దశంకరంపేట, శివ్వంపేట మండలాల్లో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు మిర్‌దొడ్డికి... కల్హేర్ మండలంలోని టీచర్‌ను తొగుటకు, పెద్ద శంకరంపేటలోని వారిని కొండపాక మండలానికి అక్రమంగా బదిలీ చేశారు.

 ఉర్దూ వారు ‘తెలుగు’లోకి

- జహీరాబాద్, సదాశివపేట మండలాల్లో పనిచేసే ఇద్దరు ఉర్దూ మీడియం మహిళా టీచర్లను పటాన్‌చెరువులోని తెలుగు మీడియం పాఠశాలకు బదిలీ చేశారు.

- మెదక్‌లో పనిచేస్తున్న ఓ బయోసైన్స్ ఉపాధ్యాయురాలు సిద్దిపేట బాలికల ఉన్నత పాఠశాలకు అక్రమంగా బదిలీ అయ్యారు. వాస్తవానికి కౌన్సెలింగ్‌లో ఆమె నంబర్ వచ్చినప్పుడు సిద్దిపేటలో పోస్టు ఖాళీగా లేవు. కౌడిపల్లి మండలంలో పనిచేస్తున్న ఓ సైన్స్ స్కూల్ అసిస్టెంటూ అలానే ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. అతను కోరుకున్న ఆ పాఠశాల అతని సీరియల్ నంబర్ తరువాత ఖాళీగా చూపిస్తోంది.

- ఓ ఉపాధ్యాయురాలు కౌన్సెలింగ్‌లో రేగోడ్ మండలంలోని ఓ పాఠశాలలో పోస్టింగ్ తీసుకున్నప్పటికీ బదిలీ మాత్రం ఖాదిరాబాద్‌కు చేశారు.

- మెదక్‌లోని ఓ తెలుగు స్కూల్ అసిస్టెంట్ నాట్‌విల్లింగ్ చెప్పినప్పటికీ ఆయన్ను సదాశివ పేటకు బదిలీచేశారు.

 

సమగ్ర విచారణ జరపాలి

ఈనెల 7 నుండి 19 వరకు జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముత్యాలు, ప్రధాన కార్యదర్శి సంజీవయ్య, జిల్లా ఉపాధ్యక్షులు వి.సంగయ్య, జిల్లా కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అదనపు కార్యదర్శి సదన్‌కుమార్, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

 

ఎల్‌ఎఫ్‌ఎల్ బదిలీలు.. పదోన్నతుల్లోనూ.. అవే అక్రమాలు

ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంల బదిలీ కౌన్సెలింగ్‌లో కొంతమంది ఉపాధ్యాయులు తమ అనుకూలమైన ప్రదేశాల్లో ఖాళీ లేకపోవడంతో ప్రమోషన్‌కు నాట్‌విల్లింగ్ చెప్పి, సర్వీస్ రిజిస్టర్‌లో ముద్ర వేయించుకున్నారు. కానీ 17న నిర్వహించిన ప్రమోషన్ కౌన్సెలింగ్‌లో కొత్త ప్రదేశాల్లో ఖాళీల ను చూపారు. అందులో 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి.



దీంతో 14న నాట్‌విల్లింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయారు. తిరిగి ఈనెల 16న పదోన్నతులు నిర్వహించిన సమయంలో సమాచారం లేక  గైర్హాజరైన వారిని పరిగణలోకి తీసుకోకుండా అందుబాటులో ఉన్న వారికే ప్రమోషన్లు ఇచ్చారు. అలాగే ఉపాధ్యాయ సంఘాల పేరిట కూడా కొంతమంది ఒకే యూనియన్ నుండి పరిమితికి మించిన  సంఖ్యలో అదనంగా పాయింట్లు పొంది తమ అనుకూలమైన ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top