సర్వత్రా దిగ్భ్రాంతి

కరీంనగర్‌లో కొవ్వొత్తులతో ఓ పాఠశాల విద్యార్థుల నివాళి


►మాసాయిపేట ఘటనతో విషాదం

►పసిమొగ్గలకు జిల్లా ప్రజల నివాళి

►జిల్లావ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు

 ముకరంపుర: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంపై జిల్లాలో సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. స్కూల్ బస్సును రైలు ఢీకొనడంతో అభం శుభం ఎరుగని 23 మంది పిల్లలు మృత్యువాతపడటం అందరినీ కలచి వేసింది. ఈ సంఘటనపై జిల్లాలో ని వివిధ రంగాల నాయకులు, ప్రముఖులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న స్కూల్ బస్సులపై అధికారుల నియంత్రణ కొరవడిందని విమర్శించారు.



నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రైల్వే గేట్ల వద్ద సిబ్బందిని నియమించి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై టీఎన్జీవో జిల్లాఅధ్యక్ష, కార్యదర్శులు ఎంఏ.హమీద్. నర్సింహస్వామి సంతాపం తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల ఆత్మ శాంతించాలని కోరుతూ జిల్లావ్యాప్తంగా విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో చిన్నారులకు కొవ్వుతులతో నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top