‘సీఎం కేసీఆర్‌ మాటల మాంత్రికుడు’

‘సీఎం కేసీఆర్‌ మాటల మాంత్రికుడు’ - Sakshi

► ప్రచారం తప్ప చేసింది శూన్యం

► ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

► మాజీ ఎంపీ, టీపీసీసీ అధికార ప్రతినిధి రవీంద్రనాయక్‌

 

కొడకండ్లః పిట్ట కధలతో బూరడి కొట్టిస్తూ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తూ మాటల మాంత్రికునిగా సీఎం కేసీఆర్‌ ఖ్యాతి గడించాడని మాజీ ఎంపీ, టీపీసీసీ అధికార ప్రతినిధి ధరావత్‌ రవీంద్రనాయక్‌ విమర్శించారు. ఆదివారం కొడకండ్ల శివారులో జరిగిన వివాహ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సమైక్య పాలనలో నిధులు, నీళ్లు, వనరుల దొపిడికి గురైన తెలంగాణలోని సబ్బండ వర్గాల వారు తెలంగాణ వస్తే తమ ఆశలు నేరవేరుతాయని వినూత్న తరహాలో ఎన్నో ఉద్యమాలు చేసారని గుర్తు చేశారు.



భూపోరాట యోధుడు జాటోత్‌ ఠానునాయక్‌ నుంచి ప్రవీణ్‌కుమార్‌నాయక్, శ్రీకాంతచారి లాంటి అనేకమంది తమ ప్రాణాలను త్యాగం చేసి తెలంగాణను సాధించుకొంటే ప్రజల ఆశలు ఆడియాసలు చేస్తూ కేసీఆర్‌ పరిపాలన సాగిస్తున్నాడని విమర్శించారు. సబ్బండ జాతుల పోరాటంతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ అధికారాన్ని అనుభవిస్తూ ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడేళ్లలో వందలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే కనీసం ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదన్నారు.



దళిత, గిరజనులకు మూడెకరాల భూమి ఆటకెక్కించారని, ఇంటికో ఉద్యోగం, డబుల్‌బెడ్‌రూం ఇళ్ల ఊసేలేదని, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్, తండాలు గ్రామ పంచాయతీలు వంటి హామీలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని రవీంద్రనాయక్‌ దుయ్యబట్టారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వడం లేదని, ప్రశ్నించే వారిపై ఎదురుదాడి సంస్కృతిని అవలంభిస్తున్నారని తెలిపారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల రీడిజైనింగ్‌ పేరుతో పనులు చేపట్టకుండా కాంట్రాక్టర్‌లతో ప్రభుత్వం కుమ్మక్కై మోసం చేస్తుందని, హరితహారం పేరిట రూ.వెయ్యి కోట్ల దుర్వినియోగంతో పాటు కృష్ణా, గోదావరి పుష్కరాల పేరిట మరో 1200 కోట్ల నిధులు వృధా చేసిందని ఆయన విమర్శించారు.



తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక రాష్టాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ను కేసీఆర్‌ విమర్శించడం సిగ్గుచేటన్నారు. ప్రచార ఆర్భాటాలు మాటల గారడితో బూరడి కొట్టిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్పేందుకై తెలంగాణ ప్రజలు సంసిద్దులై ఉన్నారని అన్నారు. కులవృత్తులకు సంబంధించిన కార్పోరేషన్లకు బడ్జేట్‌లో నిధులు కేటాయించకుండా గొర్రెలు, బర్రెలు, పందుల పధకాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.40 లక్షల ఉద్యోగాలు భర్తి చేయకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తుందని తెలిపారు.



జనాభాలో 50 శాతం ఉన్న మహిళలకు క్యాబినేట్‌లో స్థానం కల్పించకుండా మహిళలను అవమానపరుస్తూ కేసీఆర్‌ మోసం చేస్తున్నాడని రవీంద్రనాయక్‌ మండిపడ్డారు. తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో తండాలు అభివృద్ది చేందే అవకాశం ఉన్నా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్‌ మాయమాటలకు మోస పోయిన ప్రజలు మరోసారి మోసపోయే దుస్థితిలో లేరని సమయం కోసం వేచిచూస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో నంగారాభేరి నాయకులు భూక్య శ్రీనునాయక్, శంకర్‌రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top