సైకిల్! టాప్‌గేర్ లో కారు

సైకిల్!  టాప్‌గేర్ లో కారు - Sakshi


గులాబీ నాయకత్వం మాంచి ఊపుమీదుంది. పూర్తి స్థాయిలో బలోపేతం కావడంపై దృష్టి సారించింది. జిల్లాలో తెలుగుదేశంపార్టీని నామరూపాలు లేకుండా చేసే వ్యూహం కనిపిస్తోంది. దీనికి తగినట్లే, ఇక లాభం లేదనుకుంటున్న టీడీపీ నాయకులు కొందరు

టీఆర్‌ఎస్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు.




 టీఆర్‌ఎస్‌వైపు .. టీడీపీ నేతల చూపు

- ముఖ్యనేతలూ వలస వెళ్లే అవకాశం

- ఇప్పటికే జరిగిన  మాటాముచ్చట


సాక్షిప్రతినిధి, నల్లగొండ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత  సాగర్ ఆయకట్టు నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందన్న తుది అభిప్రాయానికి టీఆర్‌ఎస్ నాయకత్వం వచ్చినట్లే కనిపిస్తోంది. దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు, మొత్తంగా జిల్లాలో పూర్తిస్థాయిలో బలోపేతమయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే ముందు టీడీపీని వాష్‌ఔట్ చేసేపనిలో గులాబీ నాయకత్వం ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే చేరికల ద్వారా బలపడే పనిలో టీఆర్‌ఎస్ ఉన్నట్లు ఇట్టే తెలిసిపోతుంది.



తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న ఆయా పార్టీల నాయకుల స్థాయి, ఆయా నియోజకవర్గాల్లో వారికున్న బలం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కోదాడ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌కు వలసపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో మాటాముచ్చట కూడా జరిగిందని, ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరగణం, మరికొందరు నియోజకవర్గ స్థాయి నాయకులు సైతం టీఆర్‌ఎస్‌లో చేరడానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.



నల్లగొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో పార్టీ నుంచి ఓ నేత సస్పెండ్ అయ్యారు. ఇటీవలే టీడీపీ నాయకత్వం ఆ నేతపై సస్పెన్షన్  ఎత్తివేసింది. అయినా, జిల్లాలో టీడీపీకి ఇక భవిష్యత్  లేదన్న తుది నిర్ణయానికి వచ్చిన ఆ నేత కారెక్కడానికి రెడీగా ఉన్నారని సమాచారం. అయితే, నల్లగొండ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లో ఉన్న వివిధ సమీకరణాల నేపథ్యంలో కొద్దిగా ఆలస్యం జరిగినట్లు చెబుతున్నారు. పార్టీలోని సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి సహా పలువురు పట్టణ నాయకులు గులాబీ కండువాలు కప్పుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి కూడా కొద్ది మంది నాయకులు టీఆర్‌ఎస్ చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.



అయితే, ఇతర పార్టీల కంటే టీడీపీ నుంచే ఎక్కువగా వలసలు ఉండే అవకాశం కనిపిస్తోంది. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరి అనూహ్యంగా నార్కట్‌పల్లి ఎంపీపీ కావడంతో టీడీపీ నేతల్లో ఆలోచన మొదలైనట్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కోదాడ, హుజూర్‌నగర్ నియోజవకర్గాల నుంచి పలువురు నాయకులు గులాబీ జెండాలు కప్పుకునేందుకు తహతహలాడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన మరో ముఖ్య నాయకుడు సైతం టీఆర్‌ఎస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.



గత ఎన్నికల్లో దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, నల్లగొండ నియోజకవర్గాలను టీఆర్‌ఎస్ కోల్పోయింది. ఇప్పుడు ఇదే నియోజకవర్గాల నుంచి టీడీపీకి చెందిన పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరడానికి సుముఖంగా ఉండి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు వినికిడి. ఎలాంటి కండీషన్లు పెట్టకుండా పార్టీ కోసం పనిచేయడానికి వచ్చే వారిని ఆహ్వానించాలని గులాబీ నాయకత్వం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి చేరికలు ఉపకరిస్తాయన్న ఆలోచనలో టీఆర్‌ఎస్ నాయకత్వం కూడా ఉందని అంటున్నారు. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే జిల్లాలో టీడీపీ మనుగడ, ఉనికి ప్రశ్నార్థకం కానున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top