‘టోల్ ’ తీసే దమ్ముందా..?

‘టోల్ ’ తీసే దమ్ముందా..?

  •     ఎంపీ అభ్యర్థులకు స్థానికుల సవాల్

  •      ప్రజల పాలిట శాపంగా టోల్‌ట్యాక్స్ వసూళ్లు

  •      సొంతూళ్లో పరాయి బతుకులా?

  •      కంటోన్మెంట్ వాసుల విస్మయం

  •  పుట్టి పెరిగిన ఊరు.. ఏళ్ల తరబడి నివాసం.. కానీ పరాయి వాళ్లలా పన్నులు చెల్లించాల్సిన దుస్థితి.. ఇదీ కంటోన్మెంట్‌వాసుల కన్నీటి గాధ. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ‘పన్నులను పటాపంచలు చేస్తాం.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తాం’ అన్న నేతల వాగ్దానాలు ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయి. అందుకే ఈసారి కంటోన్మెంట్ ప్రజానీకం ఓటడిగేందుకు వచ్చే అభ్యర్థులందరికీ ఓ సవాల్ విసురుతోంది ‘ఈ ఏరియాలో రోడ్లపై పన్నుల వసూళ్లకు ఫుల్‌స్టాప్ పెట్టే దమ్ముందా?’ అని.    

     

    కంటోన్మెంట్ ప్రాంతంలోకి వచ్చే సరుకు, రవాణా వాహనాల నుంచి ఆక్ట్రాయ్- టోల్‌ట్యాక్స్ పేరిట పన్ను వసూలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కంటోన్మెంట్‌లోని రోడ్లను వినియోగిస్తున్నందుకు గాను టోల్‌ట్యాక్స్, సరుకు రవాణా చేస్తున్నందుకు ఆక్ట్రాయ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బ్రిటీష్ కాలంలో ప్రారంభమైన ఈ వసూళ్ల పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది.



    2013-14 సంవత్సరాలకు గాను ఈ వసూళ్ల కాంట్రాక్టును ఆయా కాంట్రాక్టర్లు రూ.11 కోట్లకు దక్కించుకున్నారు. అంటే వారు కంటోన్మెంట్ బోర్డుకు రూ.11 కోట్లు చెల్లించి కంటోన్మెంట్ చుట్టూరా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వసూళ్లు చేసుకునే హక్కు సాధించారు. వీరు కనిష్టంగా ఏడాదికి రూ.30 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

     

    నేతల హామీలేమయ్యాయి?

     

    కంటోన్మెంట్ ప్రజల పాలిట శాపమైన ఆక్ట్రాయ్- టోల్‌ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయిస్తానని స్థానిక ఎంపీ సర్వే సత్యనారాయణ గతంలో పలుమార్లు హామీలిచ్చాడు. ఈ మేరకు బోర్డు కోల్పోయే ఆదాయాన్ని ప్రత్యామ్నాయ మార్గాల్లో సమకూర్చుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఎంపీగా, ఇటీవల కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన సర్వే తన పదవీకాలంలో ఎందుకీ హామీ అమలు చేయలేకపోయారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!! పైగా ఈసారి కూడా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పటికైనా టోల్‌ట్యాక్స్ వసూళ్లపై ఆయన వైఖరిని స్పష్టం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

     

    మల్లారెడ్డి, మైనంపలి ఏమంటారో?

     

    కంటోన్మెంట్‌కు గుండెలాంటి బోయిన్‌పల్లి నివాసి అయిన టీడీపీ ఎంపీ అభ్యర్థి మల్లారెడ్డికి ఆక్ట్రాయ్- టోల్‌ట్యాక్స్ వసూళ్ల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సొంతప్రాంతం వారి కష్టాలకు ఆయన ఏ భరోసా ఇస్తారోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఇక టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుకు కంటోన్మెంట్ ప్రాంతంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఆక్ట్రాయ్- టోల్‌ట్యాక్స్ కాంట్రాక్టరు (ఆయన అనుచరుల పేరిట)గానే ఆయన ఇక్కడి వారికి సుపరిచితులు.



    ఏళ్ల తరబడి ప్రజల నుంచి కోట్లాది రూపాయల వసూళ్లు చేయడంపై ఓ నేతగా ఆయన ఏం సమాధానం చెబుతారో? ఆయన గెలిస్తే టోల్ ట్యాక్స్‌ను ఎత్తేస్తానని హామీ ఇవ్వగలరా అని స్థానికులు సవాలు విసురుతున్నారు. ఇక కంటోన్మెంట్‌తో అనుబంధం ఉండి మల్కాజిగిరి బరిలో ఉన్న  ముగ్గురు ప్రధాన పార్టీల అభ్యర్థుల వైఖరి ఇలా ఉండగా.. పోలీస్‌బాస్‌గా పేరొందిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దినేశ్‌రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో!!

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top