ఎందుకో ఈ అలక్ష్యం!

ఎందుకో ఈ అలక్ష్యం! - Sakshi


ఇచ్చేది గోరంత.. చూపించేది కొండంత అన్నట్లుంది జిల్లాలో వ్యవసాయ రుణాల పరి స్థితి. బ్యాంకర్లు కొత్తగా వ్యవసాయ రుణాలివ్వకున్నా.. లక్ష్యాన్ని చేరుకున్నట్లు చూపించే విషయంలో మాత్రం ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు తొలి అర్ధమాసాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ ప్రాపకం కోసం వారు ఎంత వరకు ఆరాట పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

 


మాఫీ.. కిరికిరి

* తక్కువ రుణాలిచ్చినా.. లక్ష్యం చేరినట్లు చూపిస్తున్న బ్యాంకర్లు

* రెన్యువల్‌తో కలిపినా 60 శాతం మందికే రుణాలు

* తొలి అర్ధ సంవత్సరంలో ఇదీ జిల్లాలో పరిస్థితి


ఒంగోలు: రైతు రుణమాఫీ పేరిట అన్నదాతలు గందరగోళంలోకి నెట్టేసిన టీడీపీ ప్రభుత్వం.. ఈ విషయంలో మాఫీ భారం ఎంత తగ్గినా తగ్గినట్టేనని శతథా ప్రయత్నిస్తోంది. ఆర్‌బీఐ అంగీకరించకపోవడంతో రైతు సాధికారత కార్పొరేషన్ ఏర్పాటుచేసి తద్వారా మాఫీ చేస్తామంటూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మాఫీని ఎగ్గొట్టేందుకు పలు ఆంక్షలు విధించి రైతు కుటుంబాల్లో తీవ్రమైన సంక్షోభాన్నే తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న బ్యాంకర్లు ఈ ఏడాది వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు సరికొత్త ప్లాన్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 

ఆంక్షల చట్రంలో రైతన్నలు

వ్యవసాయ రుణం కావాలని బ్యాంకర్ల వద్దకు వెళ్తే‘పొలం ఏ ఊళ్లో ఉందో అక్కడే రుణం తీసుకోవాల’ని ంటూ సరికొత్త ఆంక్షలు పెడుతున్నారు. ఇవన్నీ తిరగలేక రైతు కాస్తా ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నాడు. అయినా బ్యాంకర్లు మాత్రం లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం రికార్డుల పరంగా ముందే ఉండడం గమన్హాం.

 

కౌలు రైతులకు రుణాలు నిల్

సాధారణంగా ఈ ఆరు నెలల కాలంలో ఖరీఫ్ సాగే ప్రధానం. కానీ ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అంచనాల ప్రకాారం సాగు మొత్తం 64 శాతం మాత్రమే. ఇందులో కౌలుదారులు 20శాతంు. వారికి రుణాలు ఇచ్చిన దాఖలాలే జిల్లాలో లేవు. మిగిలిన 44 శాతంలోనూ చాలామంది రైతులు రుణాల ఊబిలో కూరుకుపోయి ఉన్నారు. రుణం కడతారా.. బంగారం వేలం వేయమంటారా అంటూ బ్యాంకర్లు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. తాము వ్యవసాయ రుణాలిస్తున్నామని చెబుతున్నా.. వాస్తవానికి వ్యవసాయానికి బంగారు ఆభరణాలపై ఇవ్వడాన్ని నిలిపివేశారు.  కొత్తగా పట్టుమని 15 శాతం మందికి కూడా రుణాలిచ్చిన దాఖలాలు లేవు.

 

రెన్యువల్స్‌లో మతలబు!

ఈ ఏడాది వ్యవసాయ రుణ లక్షాన్ని చేరుకునేందుకు బ్యాంకర్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. సాధారణంగా గతంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రైతు రుణాన్ని రెన్యువల్ చేసి పెద్ద మొత్తంలో రుణాలిచ్చినట్లు లెక్కలు చెప్పేవి. ఇప్పుడు వాణిజ్య, గ్రామీణ బ్యాంకులు కూడా అదే పంథా అనుసరించడం గమనార్హం. దాని ప్రకారం గతంలో రైతులు తీసుకున్న బంగారపు రుణాలను రద్దుచేసి, తాజాగా వాటికి రుణాలు ఇచ్చినట్లుగా బ్యాంకర్లు వారి ఖాతాలను రెన్యువల్ చేశారు. లేని పక్షంలో బంగారాన్ని వేలం వేస్తామంటూ హెచ్చరికలు చేస్తుండడంతో రైతులు వడ్డీ, అసలులో కొంతమొత్తం కట్టి తాత్కాలికంగా ఉపశమనం పొందగా... బ్యాంకర్లు మాత్రం ఈ ఏడాది ఖరీఫ్‌లో 74.67 శాతం ఖరీఫ్ రుణాలిచ్చినట్లు ప్రకటిస్తుండడం విశేషం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top