నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ


డిసెంబర్ 27న పోలింగ్

 ఇంకా ఖరారు కానీ అభ్యర్థులు  

 గెలుపు గుర్రాలపై పార్టీల కుస్తీసాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
శాసనమండలి ఎన్నికల తొలి ఘట్టానికి బుధవారం తెరలేవనుంది. స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. జిల్లావ్యాప్తంగా 769 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు, ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటేసే ఈ ఎన్నికలు ఈనెల 27న జరుగనున్నాయి. స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కౌన్సిల్‌కు ప్రాతినిధ్యం వహించిన పట్నం నరేందర్‌రెడ్డి గత మే 1న రిటైర్ కావడంతో ఈ సీటు ఖాళీ అయింది.

 

 రాష్ట్ర పునర్విభ జనలో జిల్లాకు మరో సీటు అదనంగా లభించింది. ఈ రెండు స్థానాలకు తాజాగా ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో జిల్లా రాజకీయం హాట్‌హాట్‌గా మారింది. వరంగల్ గెలుపుతో దూకుడు మీదున్న టీఆర్‌ఎస్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కైవసం చేసుకోవాలని వ్యూహాలకు పదునుపెడుతుండగా, వరుస ఓటమితో కసి మీద ఉన్న కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే చిరకాల రాజకీయ ప్రత్యర్థి టీడీపీతో కూడా జతకట్టేందుకు సంకేతాలు పంపింది.

 ఈ నేపథ్యంలో ఆసక్తికరంగా మారిన మండలి సమరం జిల్లాలో సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపింది. ఇప్పటివరకు అభ్యర్థుల ఖరారుపై స్పష్టత రానప్పటికీ, కసరత్తు మాత్రం జోరుగా సాగుతోంది. టీఆర్‌ఎస్ నుంచి ఒక స్థానానికి నరేందర్‌రెడ్డి తిరిగి పోటీచేసేందుకు అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకరించిందని ప్రచారం జరుగుతోంది. రెండో సీటు విషయంలో మాత్రం పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. సామాజిక సమీకరణల నేపథ్యంలో ఈ సీటును బీసీలకు కేటాయిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వర్గం నేతలేగాకుండా ఇతరుల కూడా రేసులో నిలిచేందుకు తహతహలాడుతున్నారు.



ప్రతిరోజు సీఎం క్యాంపు ఆఫీసు, కేటీఆర్  పేషీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు చాపకింద నీరులా ఇతర పార్టీల ఎంపీటీసీలకు గాలం వేస్తూ ఆపరేషన్ ఆకర్ష్‌ను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీల మధ్య దాదాపుగా మైత్రీ కుదరడంతో చెరొక సీటుకు పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అభ్యర్థుల విషయానికి వస్తే కాంగ్రెస్ తరుఫున  సుధీర్‌రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

 

 అలాగే టీడీపీ తరుఫున సామ భూపాల్‌రెడ్డి లేదా గోపాల్‌ను రంగంలోకి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికితోడు మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలో దించితే ఎలా ఉంటుందనే అంశంపై కూడా టీడీపీ సమాలోచనలు జరుపుతోంది. ఈ మేరకు ఆయనతో కూడా టచ్‌లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



http://img.sakshi.net/images/cms/2015-12/61448996296_Unknown.jpg




 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top