నేడే ‘పరిషత్’ ఫలితాలు


 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మున్సిపల్ లెక్క తేలింది. ఇక పరిషత్ పోరులో గెలుపోటముల లెక్క తేలనుంది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(జెడ్పీటీసీ), మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం(ఎంపీటీసీ)లకు జరిగిన ఎన్నికల ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. నెల రోజులుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠకు తెరపడనుంది. ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఐదు డివిజన్‌లలో స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్సులను భద్రపర్చారు.



 ఆయా స్ట్రాంగ్ రూంల పరిధిలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లోని కోలాం ఆశ్రమ పాఠశాల, నిర్మల్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉట్నూర్‌లోని కేబీ కాంప్లేక్స్, ఆసిఫాబాద్‌లోని ఐటీడీఏ బాలికల వసతిగృహం, మంచిర్యాలలోని ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఓట్లు లెక్కించనున్నారు. జిల్లాలోని 52 జెడ్పీటీసీ,  633ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతలుగా ఏప్రిల్ 6న, 11న ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులోమూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.



 52 జెడ్పీటీసీ.. 633 ఎంపీటీసీలు..

 జిల్లాలోని 52 జెడ్పీటీసీ, 636 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో మూ డు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నేరడిగొండ, కుభీర్, సారంగాపూర్ మండలాల్లో ఒక్కో ఎంపీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. మిగతా 52 జెడ్పీటీసీ, 633 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఓట్లను లెక్కించేందుకు జిల్లాలోని ఐదు స్ట్రాంగ్ రూంల పరిధి లో 541 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్ సూపర్‌వైజర్లు ఒక్కో టేబుల్‌కు ముగ్గురు అధికారుల చొప్పున నియమించా రు. అయితే 541 టేబుళ్లకు 627 మంది సూపర్‌వైజర్లు, 1,825 అసిస్టెంట్ సూపర్‌వైజర్లను నియిమంచారు. 269 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచా రు. లెక్కింపుకు మొత్తం 2,696 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.



 పల్లెల్లో వేడేక్కిన రాజకీయం

 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానుండటంతో పల్లెలో రాజకీయం వేడెక్కింది. జిల్లాలోని 52 జెడ్పీటీసీ స్థానాలకు ఏకంగా 267 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక్కో జెడ్పీటీసీ స్థానానికి సుమారు 5 నుంచి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 633 ఎంపీటీసీ స్థానాలకు 2,710 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఐదు నుంచి 15 మంది వరకు అభ్యర్థులు ఉండడంతో అభ్యర్థులకు కంటిమీదా కునుకు లేకుండా చేస్తోంది. ఏప్రిల్ 11తో ముగిసిన పరిషత్ ఎన్నికలు సుమారు నెల తర్వాత ఫలితాలు విడుదలవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. గెలుపుపై ధీమాగా ఉన్న అభ్యర్థులు కూడా ఫలితాలు చూస్తుంటే మాత్రం ముచ్చేమటలు పడుతున్నాయి. ఇందుకు సోమవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలే  నిదర్శనం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top