కబ్జాకోరలు

కబ్జాకోరలు


నేడు జెడ్పీ తొలి సమావేశం

- జెడ్పీ స్థలం అన్యాక్రాంతం!

- విలువ రూ.4 కోట్లు

- రాజకీయ నాయకుల అండ

- స్వాధీనం చేసుకోవాలని జేసీలు ఆదేశించినా స్పందించని జెడ్పీ అధికారులు

- ఏళ్ల తరబడి కోర్టులోనే నానుతున్న వ్యవహారం

- నూతన పాలక వర్గమైనా పట్టించుకునేనా?

ఖమ్మం జెడ్పీసెంటర్: కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న జిల్లా పరిషత్ భూమి  కబ్జాకు గురవటం సంచలనం కలిగిస్తోంది. జిల్లా పరిషత్ భవనం 1964లో ఖమ్మం నడి బొడ్డున నిర్మించారు. ఉద్యోగుల నివాస గృహల నిమిత్తం జెడ్పీ పక్కనే సర్వే నంబర్ 236, 237లో స్థలాన్ని కొనుగోలు చేసి క్వార్టర్లు నిర్మించారు. దానిలో 840 గజాల జాగాను 1984లో ఇతరులు అధికారులు, రాజకీయ నేతల పలుకుబడితో ఆక్రమించారు. దాని చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు జిల్లా పరిషత్ అధికారులు పూనుకోగా దానికి అడ్డుతగిలారు. వ్యహారం కోర్టుకు చేరింది.



ఏళ్ల తరబడి న్యాయస్థానంలో నానుతోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ 2013లో కలెక్టర్‌ను ఆదేశించారు. ఎన్నికల కారణంగా దీనిపై దృష్టి సారించకపోవడంతో కబ్జాదారులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఈనెల 4న జిల్లా  కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి గతంలో ఇచ్చిన ప్రభుత్వ నివేదికను రద్దు చేయాలని, జెడ్పీకే స్థలాన్ని అప్పగించేలా చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు.

 

అసలేం జరిగిందంటే...

జిల్లా పరిషత్ ఉద్యోగుల నివాస గృహాల నిమిత్తం 1968 డిసెంబర్ 17న రెవెన్యూశాఖ ద్వారా ఆర్డీవో ల్యాండ్ అక్విజిషన్ అధికారిగా ఆర్డర్ సీ 2132/66 ప్రకారం మొత్తం క్వార్టర్ల నిర్మాణానికి 3.39 గుంటల భూమిని కొనుగోలు చేసి ఉద్యోగులకు క్వార్టర్లు నిర్మించారు. దీనిలో కె.సర్వేశం, కె.యుగంధర్‌ల వద్ద 237/3లో 0.07 గుంటల భూమిని కొనుగోలు చేశారు. అనంతరం ఈ భూమిలో 840 గజాలను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో అధికారులు అడ్డుకున్నారు. కబ్జాదారులు పలు మార్లు కోర్టును ఆశ్రయించినా ఈ స్థలం జిల్లా పరిషత్‌కు చెందిందేనని జేసీ శ్యాంబాబు కోర్టులో తీర్పునిచ్చారు. మళ్ళీ కబ్జాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పునః సర్వే చేసి చర్యలు తీసుకోవాలని కోర్టు జేసీని ఆదేశించింది.



జేసీ ఆదేశాల మేరకు స్థల వివాదంపై ల్యాండ్ సర్వే అధికారులు సర్వే నిర్వహించారు. ఆ స్థలం జెడ్పీదేనని జేసీ సాల్మన్‌ఆరోక్యరాజ్ తీర్పు నిచ్చారు. ఈ తీర్పుపై కబ్జాదారులు ప్రభుత్వానికి అప్పిల్ చేశారు. తిరిగి జిల్లా కలెక్టర్, జేసీలను తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 2010 ఆగస్టు 31వ తేదీన ఆర్డీవో సర్వే రిపోర్టును జత చేస్తూ  వివాదాస్పదమైన భూమి అని లేఖలో రాశారు.



ఆ ఆర్డీవో నివేదికను ఆధారంగా చేసుకొని హైదరాబాద్ రెవెన్యూ అధికారులు 2013 జూలైలో ఇద్దరు జాయింట్ కలెక్టర్ల ఆదేశాలను రద్దు చేసి, తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను ఆదే శించారు. ఎన్నికల వల్ల కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ అధికారులు అప్పటి కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలో ఆ రాళ్ళను జేసీబీతో తొలగించారు. ఈ భూమి తమకు చెందినదని కోర్టును ఆశ్రయించిన వ్యక్తులు మొదట్లో సదరు స్థలం 235కు చెందినదైనప్పటికీ 237/3 సర్వే నంబర్‌లో భూమి తమదిగా కోర్టులో పిటిషన్ వేశారు.  



2013 మే నెలలో కలెక్టర్ సిద్ధార్థజైన్ 2010 ఈ వివాదాస్పద భూమి జిల్లా పరిషత్ క్వార్టర్ల నిర్మాణ నిమిత్తం కొనుగోలు చేసిన భూమిలో భాగమేనని అవార్డ్ ప్రొసీడింగ్ ల్యాండ్ అక్విజిషన్‌లతో నివేదికను ప్రభుత్వానికి పంపారు. అయితే అనేక ఏళ్ళుగా సాగుతున్న ఈ  వ్యవహారానికి తెరపడడంలేదు. ఈ స్థలం స్వాధీన ం చేసుకోవాలని అప్పటి జిల్లా జాయింట్ కలెక్టర్లుగా పనిచేసిన పలువురు జిల్లా పరిషత్ అధికారులను ఆదేశించినా..వారు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీని వె నుక గతంలో పనిచేసినా అధికారుల హస్తం ఉందనే వాదన వినిపిస్తోంది.

 

కొత్త పాలకవర్గమైనా కొలిక్కి తెచ్చేనా..?

కొత్త రాష్ట్రంలో జెడ్పీకి కొత్త పాలకవర్గం ఏర్పడింది. ఈ పాలక వర్గం స్థలం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే చర్చ సాగుతోంది. గతంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం..మరోవైపు రాజకీయ నేతల ఒత్తిడి ఉండడంతో పైలు ముందుకు కదలలేదనేఆరోపణలు ఉన్నాయి. తరువాత జిల్లా జాయింట్ కలెక్టర్లుగా పనిచేసిన ఇరువురు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకొని ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా పరిషత్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అయితే వారు ఈ వ్యవహరంలో భాగస్వాములుగా ఉన్నారని, అందుకే ఎలాంటి చర్యలు తీసుకోలేదనే వాదన ఉంది. ఖమ్మం నగరంలో రియల్ వ్యాపారం జోరందుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ఒక్కగుంట భూమి దాదాపు కోట్లు పలుకుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్‌ను అనుకుని ఉన్న భూమి విలువ ఎంత ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

 

ప్రభుత్వం ప్రత్యేక దృష్టి...

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు తేలితే వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదే శాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ స్థలంపై జిల్లా కలెక్టర్ డా.ఇలంబరితి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కడవేరు సురేంద్రమోహన్‌ను ప్రత్యేకంగా చూడాలని సూచించినట్లు తెలిసింది. ఆయన స్థలం పూర్వాపరాలు పరిశీలించారు. నివేదికను కలెక్టర్‌కు అందజేయడంతో స్థలం జెడ్పీకి చెందిందని, పలు ఆధారాలతో ప్రభుత్వానికి లేఖరాశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top