నేడు జిల్లాకు తుమ్మల

నేడు జిల్లాకు తుమ్మల


⇒ మంత్రి హోదాలో తొలిసారి రాక

⇒ఏజెన్సీ నుంచే మొదటి పర్యటన

⇒అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

⇒అధికార యంత్రాంగం సమాయత్తం


 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ర్ట మంత్రిగా మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు తొలిసారి గురువారం జిల్లాకు రానున్నారు. దశాబ్దకాలం తర్వాత మంత్రిహోదాలో జిల్లాలో పర్యటించనున్న తుమ్మలను స్వాగతించేందుకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. టీఆర్‌ఎస్ శ్రేణులు సైతం ఆయన్ను ఘనంగా స్వాగతించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు. జిల్లాలో రెండురోజుల పాటు విస్తృతంగా పర్యటించనున్న తుమ్మల తొలిరోజు భద్రాచలంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జిల్లా కేంద్రంలో రెండరోజు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సంక్షమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు.

 

సమీక్షలో...!

ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమీక్ష సమావేశంలో సీఎం పర్యటన ప్రాధాన్యాలు, ఏయే ప్రాంతంలో ఏయే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు, శంకుస్థాపనలు తదితర అంశాలపై చర్చించనున్నారు. జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ఆసరా పెన్షన్లు, పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది.



జిల్లా అభివృద్ధే లక్ష్యం..ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని జిల్లా అధికారులకు తుమ్మల హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఎక్సైజ్, రవాణా, డ్వామా, మున్సిపల్, గృహనిర్మాణం, సాంఘిక సంక్షేమం, బీసీ వెల్ఫేర్, విద్య, వైద్యం, వ్యవసాయ శాఖలకు సంబంధించిన అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను సిద్ధం చేసుకుంటున్నారు.



మంత్రి తన తొలి పర్యటనను అత్యంత మారుమూల ప్రాంతమైన వాజేడు నుంచి ప్రారంభిస్తుండటంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. భద్రాచలం డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 2003లో గోదావరి పుష్కరాలప్పుడు మంత్రిగా ఉన్న తుమ్మల, 2015లో మళ్లీ అదే హోదాలో గోదావరి పుష్కర ఏర్పాట్లపై సమీక్షిస్తారు.

 

అధికారుల ఉరుకులు పరుగులు

జిల్లాలో సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు మరోమారు రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటన, వివిధశాఖల పనితీరుపై సమీక్షించనున్న నేపథ్యంలో అధికారుల్లో హైరానా నెలకొంది. ఆహారభద్రత కార్డులు, ఆసరా పెన్షన్లలో నెలకొన్న అస్తవ్యస్తతపై ఆయన దృష్టి పెట్టే అవకాశం ఉండటంతో ఆందోళన పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఇలంబరితి ఇప్పటికే ఆయా శాఖల ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల అధికారులు ఆహారభద్రత కార్డులకు సంబంధించి మండలాలవారీగా ప్రగతి నివేదికలు, గతంలో ఉన్న కార్డులు, ప్రస్తుత కార్డుల వివరాలతో నివేదిక సిద్ధం చేస్తున్నారు.



మణుగూరు పవర్‌ప్లాంట్‌పై జిల్లా రెవెన్యూ అధికారి శివశ్రీనివాస్ దస్త్రాలు సిద్ధం చేస్తున్నారు. పౌరసరఫరాల డీఎం, మార్కెటింగ్ ఏడీలు రైతు సంక్షేమంపై చేపడుతున్న కార్యక్రమాలు, పత్తి, వరి, మొక్కజొన్న తదితర కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర, తదితర అంశాలతో నివేదికను రూపొందిస్తున్నారు. జిల్లాలో భూ సంబంధ సమస్యలు, కోర్టు కేసుల వివరాలు తదితర నివేదికలను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో రోడ్ల నిర్మాణం, వ్యయం తదితర అంశాలపై మంత్రి ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తారని ఆర్‌అండ్‌బీ అధికారులు భావిస్తూ.. అప్రమత్తమవుతున్నారు.

 

మంత్రి పర్యటన ఇలా...

* 18వ తేదీ (గురువారం) ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బేగంపేట ఏయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ బయలుదేరుతారు.

 * ఉదయం 10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకుంటారు. భద్రాచలంలో రెండో బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలిస్తారు.

* మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచలం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 12.30 గంటలకు వాజేడు చేరుకుంటారు. అక్కడ గోదావరి నదిపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జిని పరిశీలిస్తారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు.

* మధ్యాహ్నం 3 గంటలకు వాజేడు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఖమ్మం చేరుకుని రాత్రి బస చేస్తారు.

* శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని నీటిపారుదల శాఖ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

* 10.30 గంటలకు కలెక్టరేట్ లేదా జడ్పీలో జరిగే సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

 

హెలిప్యాడ్‌లు సిద్ధం చేస్తున్న అధికారులు

మంత్రి తుమ్మల హెలికాప్టర్‌లో రానున్న దృష్ట్యా ఆయన పర్యటించే ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లను సిద్ధం చేస్తున్నారు. గురువారం భద్రాచలం చేరుకుంటారు కాబట్టి అక్కడి టుబాకో బోర్డు వద్ద హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. వాజేడు, జనగాలపల్లి, ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియంలో ఆర్‌అండ్‌బీ అధికారులు హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top