నేడు ‘సత్యం’ కేసులో తీర్పు


  • 216 మంది సాక్షులను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు

  • 3,038 డాక్యుమెంట్ల పరిశీలన

  • సెబీ కేసులో ‘ఆర్థిక నేరాల’ కోర్టుకు హాజరైన నిందితులు

  • ఈడీ కేసులో శిక్షను నిలిపివేసిన మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు

  • సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా సంచలనం సష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. 2009 జనవరి 7న సత్యం కంప్యూటర్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆ సంస్థ చైర్మన్ రామలింగరాజు ప్రకటించిన విషయం తెలిసిందే. లేని లాభాలను ఉన్నట్లుగా చూపానంటూ ఆయన వాటా దారులకు లేఖలు కూడా రాశారు. దీంతో రామలింగరాజు తనను మోసం చేశాడంటూ హైదరాబాద్‌కు చెందిన షేర్ హోల్డర్ లీలామంగత్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ ఏడాది జనవరి 9న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.



    తర్వాత దీనిని సీబీఐకి బదలాయించారు. ఈ మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ... ఈ వ్యవహారంలో 14 వేల కోట్ల వరకు మోసం చేసినట్లుగా పేర్కొంది. రామలింగరాజు సహా ఇతర నిందితులపై ఐపీసీ సెక్షన్లు 120(బి) (నేరపూరిత కుట్ర), 409 (నమ్మకద్రోహం), 419, 420 (మోసం), 467 (నకిలీ పత్రాలను సష్టించడం), 468 (ఫోర్జరీ), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం), 477 (ఏ) (అకౌంట్లను తారుమారు చేయడం), 201 (సాక్ష్యాలను మాయం చేయడం) కింద అభియోగాలు మోపింది.



    నిందితులుగా బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాలకష్ణన్, తళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణ రాజు, రామకృష్ణ, వీఎస్.ప్రభాకర్‌గుప్తా, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్.శ్రీశైలం ఉన్నారు. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు... 216 మంది సాక్షులను విచారించి, సీబీఐ సమర్పించిన 3,038 డాక్యుమెంట్లను పరిశీలించింది. విచారణ పూర్తికావడంతో మంగళవారం తీర్పు వెలువరించనుంది. కాగా.. ఇదే కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కూడా ఇదే కోర్టు విచారిస్తోంది.

     

    సెబీ కేసులో కోర్టుకు హాజరు..




    మదుపుదారులను మోసం చేశారంటూ సెబీ దాఖలు చేసిన కేసులో సత్యం రామలింగరాజు సోమవారం ఈడీ కోర్టు ముందు హాజరయ్యారు. అనంతరం న్యాయమూర్తి లక్ష్మణ్.. తదుపరి విచారణను జనవరి 20కి వాయిదా వేశారు.  కాగా ‘సత్యం’ మాజీ డెరైక్టర్లకు ఈడీ కేసులో ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ఇటీవల విధించిన ఆరు నెలల జైలు శిక్షను మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే) తాత్కాలికంగా నిలుపుదల చేశారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top