స్థానిక సమరం


ఎమ్మెల్సీ ఎన్నికకు  నేడు నోటిఫికేషన్

టీఆర్‌ఎస్‌లో పెరుగుతున్న పోటీ

మిగిలిన పార్టీల్లో స్తబ్దత


 

వరంగల్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణకు బుధవారం నోటిఫికేషన్ వెలవడనుంది. నేటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు 9వ తేదీ ఆఖరు. 10న నామినేషన్లను పరిశీలించి జాబితా వెల్లడిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 12వ తేదీ వరకు ఉంటుంది. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అరుుతే ఎన్నికలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుండడంతో రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి సారించాయి. ప్రస్తుతానికి అధికార టీఆర్‌ఎస్‌లోనే ఎమ్మెల్సీ ఎన్నిక హడావుడి కనిపిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు దీనిపై ఆలోచించడం లేదు. స్థానిక సంస్థల్లో బలం లేకపోవడతో ఈ పార్టీలు స్తబ్దుగా ఉంటున్నాయి. ఈ మూడు పార్టీల నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. టీఆర్‌ఎస్‌లో మాత్రం ఎమ్మెల్సీ   టికెట్ కోసం పోటీ పెరుగుతోంది.



గెలుపు అవకాశాలు ఉండడంతో ఆ పార్టీ టికెట్ కోసం పలువురు నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని సీనియర్ నేతలంతా ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో టీఆర్‌ఎస్‌కు జిల్లాలో స్పష్టమైన ఆధిక్యత ఉంది. టికెట్ వస్తే గెలుపు గ్యారంటీ కావడంతో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు ఎ.వరదారెడ్డి, రాష్ట్ర నాయకులు నాగుర్ల వెంకటేశ్వర్లు, కన్నెబోయిన రాజయ్యయాదవ్ తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అరుుతే, నామినేషన్ల దాఖలు చివరి రోజు వరకు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఓటర్లుగా ఉంటారు. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగలేదు. న్యాయపరమైన వివాదాల కారణంగా మంగపేట మండలంలోని 14 మంది, హన్మకొండ మండలంలోని ఇద్దరు ఎంపీటీసీ సభ్యులకు ఓటు హక్కు లేదు. జిల్లాలో ప్రస్తుతం 860 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులు, 687 మంది ఎంపీటీసీ సభ్యులు, 116 మంది కౌన్సిలర్లు, ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. వీరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎన్నుకోనున్నారు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top