దశాబ్ది సంబురం

దశాబ్ది సంబురం


నేడు తెలంగాణ విద్యావంతుల వేదిక

* జిల్లాకేంద్రంలో ఏర్పాట్లు పూర్తి

* తెలంగాణ ఉద్యమానికి

* ప్రాణవాయువు అయిన వేదిక

 నల్లగొండ కల్చరల్ : తెలంగాణ సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలు, పండగలు, యాస వెక్కింరితకు గురై శిథిలావస్థకు చేరుకుంటున్న దశలో.. తెలంగాణ  సంస్కృతిని కాపాడాలని, తద్వారా ఉద్యమానికి ఆక్సిజన్  అందించాలంటూ జయశంకర్‌సార్ మదిలో మెదిలిన ఆలోచనకు ప్రతి రూపమే తెలంగాణ విద్యావంతుల వేదిక. వేదిక ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపనుంది. ఈ మేరకు జిల్లాకేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.  

 

ఉద్యమ భావాజాలాన్ని ప్రజల్లోకి..

తెలంగాణ ఉద్యమాన్ని నడిపించాలని కేసీఆర్ లాంటి వాళ్లు పార్టీని స్థాపించి సీమాంధ్రుల పాలనపై, దోపిడీపై యుద్ధం మొదలుపెట్టారు.   కొంతకాలం గడిచిన తర్వాత ఉద్యమ భావజాలాన్ని ప్రజల దాకా వెళ్లాలంటే ఒక వేదిక అవసరమని భావించి తెలంగాణ విద్యావంతుల వేదిక పురుడు పోసుకుంది. అప్పటినుంచి ఈ వేదిక.. తెలంగాణ సంస్కృతి, అభివృద్ధి ఎలా విస్మరించబడిందో అందరికీ తెలిపేలా చర్చలు నిర్వహించి తెలంగాణ ప్రజానీకాన్ని చైతన్యపరిచింది. సీమాంధ్ర రాజకీయ నాయకుల అర్థం లేని విమర్శలను తిప్పికొడుతూ ఉద్యమ చైతన్య రథానికి బంగారు బాటలు వేసింది.

 

ఉద్యమ సంస్థగా..

ప్రస్థానంలో విద్యావంతుల వేదిక ఉద్యమ సంస్థగా రూపాంతరం చెంది తెలంగాణ జేఏసీలో కీలకపక్షంగా వ్యవహరించింది. విద్యార్థులను, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, వృత్తి, వ్యాపార, ప్రజా సంఘాలను సమన్వయపరిచి తెలంగాణ సాధన దిశలో నిర్ణయాత్మక పాత్ర పోషించింది. సీమాంధ్ర పాలకులు పెట్టిన ఎన్నో అక్రమ కేసులు, అరెస్టులు, జైళ్లను ఎదుర్కొంటూ ఆత్మస్థైర్యంతో ముం దుకు నడిచింది. నల్లగొండ జిల్లాలో 2004 నవంబర్‌లో జిల్లా శాఖగా, కోదాడ వేదికగా కొంతమంది సభ్యులతో ఏర్పడింది. ఈ శాఖ ద్వారా జిల్లాలోని ప్రజలను చైతన్యపరిచేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టింది. సెమినార్లు నిర్వహించడం, కరపత్రాలు ప్రచురించి ఉద్యమ భావజాలవ్యాప్తికి విశేషంగా కృషి చేసింది.



పాట ఉద్యమానికి ప్రాణం అని తెలుసుకునిధూం...ధాం... నిర్వహణల ద్వారా ఉద్యమ లక్ష్యాలను, సీమాంధ్రుల ఆగడాలను, దోపిడీని ప్రజలకు కళ్లకు కట్టడంలో తనవంతు పాత్ర పోషించింది. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారానే రాష్ట్రం సాధించుకోవాలని లక్ష్యంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా పోరాటాన్ని నడిపింది. అనుకున్నట్లుగానే శుభం కార్డు పడింది. తెలంగాణ రాష్ట్రం అవతరించింది. దశాబ్ద కాలంగా జరిగిన పోరాటాల చరిత్రను నెమరువేసుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోటానికే ఈ దశాబ్ద ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవన్‌లో ఉదయం 10 గంటలకు ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొననున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top