రక్తదానం చేసి ప్రాణదాతలు కండి

రక్తదానం చేసి ప్రాణదాతలు కండి - Sakshi


గతంలో పోలిస్తే ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన, చైతన్యం పెరిగింది. ప్రాణాపాయంలో ఉన్నవారికి అత్యవసరంగా రక్తం అవసరమైతే అనేక మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. మనం ఇచ్చే కొద్దిపాటి రక్తం ఎంతో మంది అభాగ్యులు, వారి కుటుంబాల్లో వెలుగు నింపుతుంది. రక్తదానం పట్ల పట్టణ ప్రాంతాల్లో కొంత మేరకు అవగాహన ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలలో మాత్రం నేటికీ అపోహలు ఉన్నాయి. రక్తం ఇస్తే బలహీనమైపోతామేమోనన్న భయం నిజం కాదనే విషయాన్ని తెలియపరచాల్సి ఉంది.

 

* యువకుల్లో పెరుగుతున్న అవగాహన

* నేడు జాతీయ రక్తదాన దినోత్సవం

చేవెళ్ల, దోమ: ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏదంటే రక్తదానమని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి నిత్యం ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి అభాగ్యుల ప్రాణ రక్షణకై రక్తం అత్యవసరంగా మారింది. కావాల్సిన రక్తాన్ని వారికి అందించడం వల్ల వారికి పునర్జన్మను ఇచ్చినవాళ్లమవుతాం.



ప్రతి ఏటా గాంధీ జయంతి, అమరవీరుల సంస్మరణ దినోత్సవం, దేశ నాయకులు, సినీ నటులు, క్రీడాకారుల పుట్టిన రోజుల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రక్తదానాలు చేస్తూ ప్రాణదాతలుగా మారుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెడ్ క్రాస్ వంటి అనేక స్వచ్ఛంద సంస్థలు దాతల నుండి సేకరించిన రక్తాన్ని భద్ర పరిచి అవసరమున్న వారికి సరఫరా చేస్తున్నాయి.

 

రక్తదానంలో విద్యార్థులే టాప్

రక్తదానానికి ముందుకు వస్తున్న వారిలో విద్యార్థులు అందరికన్నా ముందంజలో ఉన్నారు. ఏటా రక్తదానం చేస్తున్న వారిలో 70 శాతం విద్యార్థులే కావడం గమనార్హం. విద్యార్థులను మినహాయిస్తే పురుషుల కన్నా ఎక్కువగా మహిళలు రక్తదానానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు సర్వేల్లో వెల్లడైంది.

 

జిల్లాలో 17 రక్త సేకరణ కేంద్రాలు

జిల్లాలో మొత్తం 17 రక్త సేకరణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఏషియన్ బ్లడ్ బ్యాంక్, కూకట్‌పల్లిలోని జనని వాలంటరీ బ్లడ్ బ్యాంక్, జీవనధార బ్లడ్ బ్యాంక్, కామినేని బ్లడ్ బ్యాంక్, లైఫ్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్, ఎంఎం వాలంటరీ బ్లడ్ బ్యాంక్, ఎన్‌ఎస్ ఏహెచ్ వికారాబాద్, ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్లతో పాటు భాస్కర్, షాదన్, ఏడీఆర్‌ఎం, అవేర్, బీబీఆర్, వీఆర్‌కే ఉమెన్స్, మల్లారెడ్డి, మెడీసిటీ, పౌలోమి మెడికల్ కళాశాలలు, ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబర్ 21వ తేదీన వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో  పోలీసులతో పాటుగా యువకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తున్నారు.

 

రక్తంలో గ్రూపులు

రక్తం గ్రూపులను 4 రకాలుగా గుర్తించారు. ఓ గ్రూపు, ఏ గ్రూపు, బీ గ్రూపు, ఏబీ గ్రూపులుగా విభజించారు. ఓ గ్రూపును విశ్వదాత అని, ఏబీ గ్రూపును విశ్వగ్రహీతయని గుర్తించారు. రక్తంలో ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్లరక్త కణాలు, క్రయో రకాలు ఉంటాయి. ప్లాస్మాలో లవణాలు, ప్రోటీన్లు మొదలైనవి ఉంటాయి. శరీరం కాలిన వారికి ఈ రక్తాన్ని అందజేస్తారు. తెల్లరక్త కణాలలో శరీరాన్ని బయటినుంచి దాడిచేసే అనేక సూక్ష్మ క్రిములు, బాక్టీరియా, వైరస్‌ల నుంచి కాపాడే శక్తి ఉంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి, ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నవారికి ఈ రక్తాన్ని అందజేస్తారు. క్రయో రకాన్ని ఏదైనా గాయమైనప్పుడు నిరంతరం ఆగకుండా రక్త స్రావమైతున్నట్లయితే అలాంటివారికి అందజేస్తారు.

 

రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడండి

తీవ్రంగా కొరత ఉన్న రక్తాన్ని దానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడినవారమవుతాం. ఏడేళ్లుగా చేవెళ్ల పరిసర ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, తదితర ప్రాంతాల్లో ఇప్పటికి 37 రక్తదాన శిబిరాలను నిర్వహించాం. నాలుగు వేలకు పైగా దాతల నుంచి రక్తాన్ని సేకరించి ప్రభుత్వాస్పత్రులకు అందజేశం.

 - పీ రామకృష్ణారావు, రక్తబంధు అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు

 

అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

సమాజ అవసరాల దృష్ట్యా అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానికి ముందుకు రావాలి. రక్తదానం ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తదానం చేస్తే బలహీనంగా మారతామనేది అపోహే. రక్తదానం చేసినా, చేయకపోయినా మన శరీరంలో రక్తనాళాలు కొద్ది రోజులకు నశించడం, కొత్తవి ఉత్పత్తి కావడం జరుగుతూనే ఉంటుంది. నేను ఇప్పటి వరకు 80 సార్లు రక్తదానం చేశాను.

 - టీ సాయిచౌదరి, రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి.

 

రక్తంలో రకాలు

1900 సంవత్సరం ప్రాంతంలో కార్ల్‌లాండ్ స్ట యినర్ అనే వైద్యుడు రక్తం గ్రూపులను కనుగొన్నాడు. ఇందుకుగాను 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. ఈయ న జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్ర తి ఏడాది అక్టోబర్ 1న భారతదేశంలో జాతీ య రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

 

జీవితకాలంలో 168 సార్లు రక్తాన్ని దానం చేయవచ్చు

ఆరోగ్య కరమైన వ్యక్తి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య కాలంలో మూడు నెలల కోసారి రక్తాన్ని దానం చేసినట్లయితే 168 సార్లు తన జీవిత కాలంలో ఇవ్వవచ్చు. దీనివల్ల ఎలాంటి బలహీనతరాదు. ఒకసారి రక్తదానం చేసినట్లయితే దానితో నలుగురి ప్రాణాలను కాపాడవచ్చు. వాస్తవానికి ఒక వ్యక్తిలో ఆరు నుంచి ఏడు లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి కేవలం 250 నుంచి350 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు. ఇది కేవలం రెండు వారాల్లో తిరిగి శరీరంలో ఉత్పత్తి అవుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top