ఎలా చేద్దాం!

ఎలా చేద్దాం! - Sakshi


 * వాటర్‌గ్రిడ్‌పై నేడు జిల్లా యంత్రాంగంతో మంత్రి కేటీఆర్ సమీక్ష

* సమావేశానికి హాజరుకానున్న ప్రజాప్రతినిధులు

* పంచాయతీ రాజ్ పనుల పురోగతిపైనా చర్చించనున్న మంత్రి


సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వాటర్‌గ్రిడ్’పై కరసత్తు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యంత్రాంగం రూపొందించిన ప్రణాళికలను క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులతో సమీక్షించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు జిల్లాలవారీ పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.



ఈక్రమంలో శనివారం ఆయన జిల్లాకు రానున్నారు. వికారాబాద్‌లోని మహవీర్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ విభాగాల్లో పనుల పురోగతితోపాటు వాటర్‌గ్రిడ్‌పై సుదీర్ఘంగా చర్చించనున్నారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీలు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

 

రూ.2,500 కోట్లతో వాటర్‌గ్రిడ్..

ప్రతిష్టాత్మక వాటర్‌గ్రిడ్ కోసం జిల్లా యంత్రాంగం రూ.2,500 కోట్లతో ప్రణాళిక తయారు చేసింది. వాటర్‌గ్రిడ్ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంతోపాటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లో కృష్ణా నీటితో.. మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాలను గోదావరి నీటితో అనుసంధానం చేసేలా ఈ ప్రణాళిక తయారైంది. మొత్తంగా గ్రిడ్ ద్వారా జిల్లాలోని 1,044 హాబిటేషన్లకు తాగునీటిని అందించనున్నారు.



ఈ ప్రణాళికకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక సర్వే మొదలైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి తుది ప్రణాళిక ఖరారుకు కొంత సమయం పట్టనుందని, కాగా క్షేత్రస్థాయిలో అన్ని వార్గాలనుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే గ్రిడ్  ప్రణాళికకు అసలురూపు రానుందని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top