నేడు ‘కాళేశ్వరం’ టెండర్లు!


రూ.5,813కోట్లతో మూడు  బ్యారేజీలకు టెండర్ నోటిఫికేషన్


 


 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భా గంగా నిర్మించే మేడిగడ్డ-ఎల్లంపల్లి బ్యారేజీల నిర్మాణాలకు మంగళవారం టెండర్లు పిలిచే అవకాశం ఉంది. బ్యారేజీలకు సంబంధించిన అంచనాలు సిద్ధమవడం, వాటికి పరిపాలనా అనుమతులుసైతం వచ్చిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు. మొదటగా మూడు బ్యారేజీల నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి, తర్వాత  ఒకట్రెండు రోజుల్లో పంప్‌హౌస్‌ల నిర్మాణానికి టెండ ర్లు పిలిచే అవకాశం ఉంది.


కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య నిర్మించే మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు, వాటి పంప్‌హౌస్‌ల నిర్మాణం, హైడ్రోమెకానికల్ పనులకు వేర్వేరుగా అంచనా వ్యయాలు సిద్ధం చేశా రు. ఇందులో మేడిగడ్డ-ఎల్లంపల్లి మార్గంలో మొత్తం గా 21.29 టీఎంసీల సామర్థ్యంతో మూడు బ్యారేజీల నిర్మాణానికి గానూ, మేడిగడ్డకు రూ.2,591 కోట్లు, అన్నారం రూ.1785 కోట్లు, సుందిళ్లకు రూ.1437 కోట్లకు.. మొత్తంగా రూ.5,813 కోట్లతో ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది.


ఇటీవలే ఈ బ్యారేజీల మధ్య పంప్‌హౌస్‌ల కోసం రూ.7,998 కోట్లతో మరో అనుమతినిచ్చింది. మేడిగడ్డ నుంచి అన్నారం మధ్య ఎత్తిపోతల కోసం రూ.3,524 కోట్లు, అన్నారం-సుందిళ్ల ఎత్తిపోతల నిర్మాణాలకు రూ.2,140 కోట్లు, సుందిళ్ల నుంచి ఎల్లింపల్లి మధ్య నిర్మాణాలకు రూ.2,334 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇందులో మొదటగా బ్యారేజీలకు సంబంధించిన పనులకు మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవనున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం 15 రోజులు కనీస గడువును విధించి టెండర్లను ఆహ్వానిస్తారు. మరో వారం సాంకేతిక పరిశీలనకు గడు వు విధిస్తారు. ఇది పూర్తయిన వెంటనే ప్రైస్ బిడ్‌లను తెరిచి టెండర్లు ఖరారు చేస్తారు. మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తికావడానికి నెల పడుతుందని అంచనా.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top