నేడు సద్దుల సంబరం

నేడు సద్దుల సంబరం


- గౌరీదేవిని కొలిచిన మహిళాలోకం

- నేడు సద్దుల బతుకమ్మ

సిరిసిల్ల/కరీంనగర్ కల్చరల్ : ప్రకృతి ఆరాధనతో కూడిన బతుకమ్మ పండగను జిల్లా మహిళలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ.. పాదం కలుపుతూ ఊరూవాడను ఏకం చేశారు. పల్లెపల్లెనా ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అనే పాటలు మార్మోగాయి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండగకు అధికారిగా గుర్తింపు ఇచ్చింది. నిర్వహణ కుసైతం ఏర్పాట్లు చేసింది. మహిళలు ఇందులో భాగస్వాములయ్యారు. జిల్లావ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి.

 

అధికారిక ఏర్పాట్లు

బతుకమ్మ పండగ నిర్వహణకు తొలిసారిగా అధికారికంగా ఏర్పాట్లు జరిగాయి. అన్ని స్థాయిల్లోనూ అధికారులు భాగస్వాములవుతూ.. బతుకమ్మ పండగను నిర్వహించారు. బతుకమ్మ పాటల పోటీలు, ఫలహారం తయారీ పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

 

ఒక్కోచోట వేర్వేరుగా..

జిల్లాలో సద్దుల బతుకమ్మ విడతలవారీగా నిర్వహిస్తున్నారు. వేములవాడలో ఏడు రోజుల్లోనే బతుకమ్మ నిమజ్జనం జరిగింది. రుద్రంగి, కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాల్లో పదకొండు రోజులుకు జరుపుకుంటారు. జిల్లావ్యాప్తంగా గురువారం మెజార్టీ ప్రాంతాల్లో బతుకమ్మ నిమజ్జనం జరుగుతుంది. బతుకమ్మ పండుగ ప్రతి ఏటా జరుగుతున్నా.. తెలంగాణరాష్ట్రంలో తొలిసారి మాత్రం అధికారికంగా జరగడం మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం పెరగడం విశేషం. తెలంగాణ మహిళలున్న ప్రతి దేశంలోనూ బతుకమ్మ ఆటలు వేడుకగా జరిగాయి.

 

పూలతో తీర్చిదిద్ది

సద్దుల బతుకమ్మ కోసం మహిళలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గుమ్మడి, తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, చేమంతి, కట్లపువ్వులు, గోరింటతోపాటు అందుబాటులో ఉన్న ఇతర పూలనూ వినియోగిస్తారు. బతుకమ్మ పైభాగంలో గౌరీదేవిని ప్రతిష్ఠించి అగరవత్తులు, ప్రమిదలు వెలిగించి వీధి కూడళ్లలో పెట్టి మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ ‘పోవయ్యా దేవ ఉయ్యాలో... తేవయ్యా పూలు ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి సందమామ.. ఒక్క జాములాయే సందమామ’ అంటూ పాటలు పాడుతారు. చివరగా సమీప చెరువులు, కుంటల్లో బతుకమ్మలు నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత వరి, గోధుమ, నువ్వులు, పెసర, మినుము, మొక్కజొన్న వంటి నవధాన్యాలు, చక్కెర కలిపి చేసిన పిండిని వాయినాలుగా ఇచ్చుకుంటారు. దీంతో బతుకమ్మ పండగ ముగుస్తుంది.

 

భగ్గుమంటున్న ధరలు

ఈ ఏడాది తంగేడు పూలు, గునుగ పూలు అవసరం మేరకు అందుబాటులో లేవు. దీంతో వ్యాపారులు పిడికెడు తంగేడుపూలను రూ. పది విక్రయించారు. గునుగు పూలకట్టలు మూడింటికి రూ.10 చొప్పున వసూలుచేశారు. చేమంతి పూలు కిలోకు రూ.200 నుంచి రూ250   అమ్మకాలు సాగించారు. బంతిపూలు కిలో 250 రూపాయలకు అమ్మారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top