సేంద్రియ సాగుకు ప్రోత్సాహం

సేంద్రియ సాగుకు ప్రోత్సాహం - Sakshi


రైతుల కోసం పరంపరగత్ కృషి వికాస్ యోజన అమలు

 

మూడేళ్లలో రూ.5కోట్ల 83 లక్షలను ఖర్చు చేయనున్న ప్రభుత్వం

1950 ఎకరాలలో సాగు చేయించాలని నిర్ణయం

వరి, పప్పు ధాన్యాల పంటలకే అమలు


 

నల్లగొండ అగ్రికల్చర్ : జిల్లాలో సేంద్రియ వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరంపరగత్ కృషి వికాస్ యోజన(పీకేవీవై) ద్వారా రైతులను ప్రోత్సహించాలని భావి స్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల  మందుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి, తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా పథకం అమలు చేయనున్నారు. కేవలం పంచగవ్వ, బీజామృతం, జీవామృతం, బయోపెస్టిసైడ్స్, వేపపిండి, వేపనూనె, వర్మి కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువుల ద్వారానే వరి, పప్పుధాన్యాలను పండించాలని జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళికలను రూపొందించింది. సేంద్రియ ఎ రువుల ద్వారా పండించి అహారధాన్యాలకు మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండడంతోపాటు ఆరోగ్యానికి ఎంతోమేలు చేకూరుతుందడడంతో రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి పీకేవీవై పథకం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.



 39 క్లస్టర్లుగా విభజన..

 జిల్లాలోని 59 మండలాలను కలిపి 39 క్లస్టర్‌లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌లో 50 మంది రైతులతో 50 ఎకరాలలో(ఒక్కో రైతు ఎకరం) సేంద్రియ వ్యవసాయాన్ని చేయించాలని నిర్ణయించింది. 39 క్లస్టర్‌లలో 30క్లస్టర్‌లలో జనరల్ రైతులు, 6 క్లస్టర్‌లలో ఎస్సీ రైతులు, 3 క్లస్టర్‌లలో ఎస్టీ రైతుల చేత సేంద్రీయ వ్యవసాయాన్ని చేయించడానికి రంగం సిద్దం చేశారు. ఈ పథకం ద్వారా 1950 మంది రైతులచేత 1950 ఎకరాలలో వరి, పప్పుధాన్యాలను సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించనున్నారు. మూడు సంవత్సరాలపాటు అమలు చేసే ఈ పథకానికి రూ. 5 కోట్ల 83 లక్షల 5 వేలను ఖర్చుచేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే లబ్దిదారుల ఎంపికను పూర్తి చేసి పంపించాలని జిల్లా వ్యవసాయ శాఖ.. మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. క్లస్టర్‌లలో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించి ఆహార ధాన్యాలను ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ చేయడానికి అవసరమైన చర్యలను కూడా చేపట్టనున్నారు.



 సంప్రదాయ వ్యవసాయంవైపు పోవాలి :  బి.నర్సింహారావు, జేడీఏ

 రైతులు సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం వైపు పయనించాల్సిన అవసరం ఉంది. కలుషితమవుతున్న వాతావారణం, తగ్గుతున్న భూసారాన్ని పెంచుకోవడం కోసం రసాయనిక మందులు, ఎరువుల వాడకాన్ని తగ్గించాలి. భూసారాన్ని పరిరక్షించుకోవడంతో పాటు తక్కువ ఖర్చుతో ఆరోగ్యవంతమైన ఆహార ధాన్యాలను పండించుకోవడానికి రైతులు సేంద్రియ వ్యవసాయం చేయాలి. పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

 

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top