భూసేకరణకు రీసర్వే

భూసేకరణకు రీసర్వే - Sakshi


శివసాగర్ ప్రాజెక్టు కాల్వల నిర్మాణ పనుల్లో కదలిక10.కి.మీ. పొడవునకుడి, ఎడమ కాల్వలు 6 గ్రామాల పరిధిలో

38 ఎకరాల సేకరణ లక్ష్యంఅప్రోచ్ రోడ్డుకుమరో ఆరు ఎకరాలు


 తాండూరు :

 పదకొండేళ్ల కిందట కాక్రవేణి వాగుపై నిర్మించ తలపెట్టిన శివసాగర్ ప్రాజెక్టు కాల్వల నిర్మాణ పనులకు మళ్లీ కదలిక వచ్చింది. యాలాల మండల పరిధిలో కాక్రవేణి వాగుపై నిర్మించనున్న శివసాగర్ ప్రాజెక్టు కాల్వల నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణకు రీ సర్వే చేపట్టనున్నారు. వెయ్యి ఎకరాలకు సాగునీరే లక్ష్యంగా 2005లో రూ.4.96 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో అంచనా వ్యయం రూ.9.7 కోట్లకు పెరిగింది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణకు అప్పట్లోనే సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేశారు. అయితే ప్రాజెక్టు అసంపూర్తిగా ఆగిపోవడంతో కాల్వల నిర్మాణాలకు భూసేకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా అధికారులు భూసేకరణకు రీ సర్వే చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు.



మూడు రోజుల్లో సర్వే పూర్తి చేసి నివేదిక అందించాలని కోరారు. స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి సాగునీటి పారుదల శాఖ అధికారులు సర్వే చేపడతారు. ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలోకి వచ్చే యాలాల, గోవింద్‌రావుపేట్, సంగంకుర్ధు, కుడి కాల్వ పరిధిలోకి వచ్చే విశ్వనాథ్‌పూర్, రాఘవాపూర్, కోకట్ పరిధిలో అధికారులు భూసేకరణ సర్వే చేపట్టనున్నారు. దాదాపు 10 కి.మీ. కుడి, ఎడమ కాల్వల నిర్మాణాలకు సుమారు 38 ఎకరాలు సేకరించాలని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీంతోపాటు యాలాల ప్రధాన రోడ్డు నుంచి ప్రాజెక్టు వరకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డుకు మరో 6 ఎకరాలు సేకరించాలని అధికారులు భావిస్తున్నారు. మూడు రోజుల్లో సర్వే పూర్తి చేసి జేసీకి నివేదిక అందజేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.



 11ఏళ్లు దాటినా వీడని గ్రహణం..

 ప్రాజెక్టు మొదలు పెట్టి దాదాపు 11 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. ఆరు గ్రామాల పరిధిలో వెయ్యి ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రస్తుత రూ.9.7 కోట్ల అంచనా వ్యయంలో రూ.5.75 కోట్లు ప్రాజెక్టు పనులకు, మిగిలిన రూ.3.32 కోట్లు భూసేకరణకు కేటాయించారు. ప్రాజెక్టు పనులకు కేటాయించిన నిధుల్లో ఇప్పటివరకు రూ.3.75 కోట్లతో అలుగు, కట్ట తదితర పనులు అరకొరగానే పూర్తి చేశారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలోనే శివసాగర్ ప్రాజెక్టును రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని గతేడాది తాండూరుకు వచ్చిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇచ్చిన హామీ నెరవేరకపోవడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top