జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్ని విజయవంతంగా నిర్వహిస్తాం


సాక్షి, రంగారెడ్డి జిల్లా:  సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం గంటసేపు పెరగడంతో జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 50శాతం ఓట్లు పోలయ్యాయని, ఈ దఫా కనీసం 70శాతం ఓట్లు పోలయ్యేలా చూస్తామని అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని వర్గాల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నామన్నారు.



 రెండున్నర నెలలుగా నిర్వహించిన ఓటరు నమోదు కార్యక్రమం ద్వారా కొత్తగా 3.47 లక్షల ఓట్లు జాబితాలో చేరాయని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ శ్రీధర్ బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇటీవల జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు నగర శివారు గ్రామ పంచాయతీల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని, ఇదే తరహాలో సాధారణ ఎన్నికల్ని కూడా  నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.



 10 సెగ్మెంట్లలో డబుల్ ఈవీఎంలు..

 జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 330 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీటిలో 10 సెగ్మెంట్లలో 15కు మించి అభ్యర్థులుండడంతో అక్కడ రెండో ఈవీఎంలు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో జిల్లాకు అదనంగా ఆరు వేల ఈవీఎంలు అవసరమని ఎన్నికల సంఘానికి లేఖ రాశాం. ఈసీఐఎల్ కూడా ఆమోదం తెలిపింది. త్వరలోనే అదనపు ఈవీఎంలు జిల్లాకు చేరుతాయి అని కలెక్టర్ శ్రీధర్ అన్నారు.



జిల్లాలో ప్రస్తుతం 4,469 పోలింగ్ కేంద్రాలుండగా.. ఓటర్ల సంఖ్య ఆధారంగా మరో 573 పోలింగ్ కేంద్రాలు అవసరమని ఎన్నికల సంఘానికి సూచించామని, దీనికి ఎన్నికల సంఘం ఆమోదం కూడా తెలిపిందని చెప్పారు.  దీంతో జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 5,042 కు చేరిందన్నారు. 1,600 ఓటర్ల కంటే ఎక్కువున్న పోలింగ్ కేంద్రానికి అదనపు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.



 ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్లు

 ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. అదేవిధంగా పోలింగ్ రోజు విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఈ అవకాశం కల్పిస్తామని, ఇందుకు సంబంధిత ఉన్నతాధికారి నుంచి లేఖ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లను నియోజకవర్గంలో ఒక చోట ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి పంపిణీ చేస్తామన్నారు.



అనంతరం ఓటువేసి బాక్సులో వేయాల్సి ఉంటుందన్నారు. ఓటర్లకు పోలింగ్‌కు ముందే ఓటర్ స్లిప్పులు అందిస్తున్నామని, ఈ స్లిప్పులు చూపిస్తే ఇతర గుర్తింపు కార్డులు చూపించాల్సిన పనిలేదని అన్నారు. పోలింగ్‌బూత్‌ల వారీగా ప్రత్యేక తేదీలు ప్రకటించి ఓటర్ స్లిప్పులు బూత్‌స్థాయి అధికారుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.



 పట్టణ ప్రాంతమే లక్ష్యంగా..

 జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్ల నుంచి మంచి స్పందన కనిపించిందని కలెక్టర్ తెలిపారు. అయితే శివారు పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు నిరాసక్తత చూపారని, నిజాంపేటలో కేవలం 25శాతం మాత్రమే ఓటింగ్ జరగడం గమనార్హమన్నారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగంపై మరింత చైతన్యపర్చాల్సి ఉందన్నారు.



పరిశ్రమలు, ఐటీ కార్యాలయాల వద్ద ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కనిష్టంగా 70శాతం పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లిక్కర్ డీలర్లకు గత ఏడాది ఇదే సమయంలో ఏమేరకు స్టాకు సరఫరా చేశామో.. ఇప్పుడు కూడా అంతే మోతాదులో స్టాకు ఇస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లాలో 1500 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, డీఆర్వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top