విలవిల..

విలవిల..


బైక్‌ను ఢీకొన్న టిప్పర్ యువకుడి దుర్మరణం

 వాహనపూజకు వెళ్తుండగా ఘటన

 అరగంటైనా జాడలేని 108 అంబులెన్స్

 సాయం కోసం అర్థించిన అతడి మిత్రుడు

 ముందుకు రాని వాహనదారులు

 వర్గల్:
కొత్త బైక్ కొని పూజ చేయిం చేందుకు ఆలయానికి వెళ్తున్న యువకుడిని టిప్పర్ ఢీకొట్టింది. సహాయం కోసం ఆ యువకుడి ప్రాణం గిలగిలలాడుతూ.. చివరకు తుదిశ్వాస విడిచింది.

 నర్సాపూర్ మండలం మంతూరు కు చెందిన కన్నంగారి జయరాములు, కమలమ్మ దంపతుల ఏకైక కుమారుడు వెంకటేశ్. ఇతడు ఇటీవలే బైక్ కొన్నాడు. పెదనాన్న కొడుకు మహేందర్, తన మిత్రులు

 వడ్ల రాజేంద్రప్రసాద్, వడ్ల వంశీకృష్ణతో కలిసి యాదగిరిగుట్టలో వాహన పూజ కోసం శనివారం ఉదయం 11 గంటలకు రెండు వాహనాలపై బయల్దేరారు. మధ్యాహ్నం 12.30 సమయంలో వర్గల్ మండలం అనంతగిరిపల్లి స్టేజీ సమీప మూలమలుపులో వెంకటేశ్ బైక్‌ను తూప్రాన్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని టిప్పర్ ఢీకొట్టింది.

 

 వెంకటేశ్ (22)కు తీవ్ర గాయాలయ్యాయి. అదే బైక్‌పై ఉన్న అతని పెదనాన్న కొడుకు మహేందర్ (25) కుడి కాలు విరిగింది. స్కూటీపై ముందు వెళ్తున్న మిత్రులు రాజేంద్రప్రసాద్, వంశీకృష్ణ ప్రమాదాన్ని గుర్తించి వెనక్కి వచ్చారు. 108కు సమాచారమిచ్చి 20 నిమిషాలు దాటినా అంబులెన్స్ రాకపోవడంతో ఓ అయ్యప్ప స్వామి కారులో వెంకటేశ్‌ను తూప్రాన్‌కు తరలించారు. అక్కడ వైద్యులు నిస్సహాయత వ్యక్తం చేయడంతో మరో ప్రైవేటు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. ప్రమాదంలో కుడికాలు విరిగిన మహేందర్‌ను 108 సిబ్బంది గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహానికి గజ్వేల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్టు గౌరారం ఏఎస్‌ఐ దేవీదాసు తెలిపారు. చేతికందిన ఏకైక కొడుకు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

 

 కాళ్లు మొక్కాం..

 సాయం కోసం బతిమాలాం..


 వెంకటేశ్ చావు బతుకుల మధ్య అరగంటకుపైగా కొట్టుమిట్టాడినా ఎవరూ మానవత్వం చూపలేదని అతనితోపాటు స్కూటీపై వచ్చిన మిత్రుడు వడ్ల రాజేంద్రప్రసాద్ బోరుమన్నాడు. కాళ్లు మొక్కాం.. ఆదుకోవాలని బతిమాలాం.. గుమిగూడిన జనం నుంచి ఒక్కరూ ముందుకు రాలేదని విలపించాడు. అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే అరగంట గడిచినా రాలేదని, పోలీసులు కూడా అక్కడకు చేరుకోలేదన్నారు. తమ ఆవేదన, చావుబతుకుల మధ్య విలవిలలాడుతున్న మిత్రుడి పరిస్థితి చూసి ఓ అయ్యప్ప స్వామి తన కారు ఇవ్వడంతో వెంకటేశ్‌ను అందులో తూప్రాన్‌కు తరలించామన్నాడు. అప్పటికే పరిస్థితి విషమించినట్లు వైద్యులు చెప్పారన్నారు. తుది ప్రయత్నంగా ప్రైవేట్ అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలిస్తుండగా కొంపల్లి శివారులో ప్రాణాలు విడిచాడని బోరుమన్నాడు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top