కలప తరలుతోంది

కలప తరలుతోంది - Sakshi


వయా గోదావరి

- ఛత్తీస్‌గఢ్.. మహారాష్ట్రల నుంచి దిగుమతి

- మంథని కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు తరలింపు

- తనిఖీలు అంతంతే..

మంథని :
‘తూర్పు’ కేంద్రంగా కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. అధికారుల అండదండలతో ఈ దందా మూడు చెట్లు.. ఆరు దుంగలుగా నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి రోజూ లక్షలాది రూపాయల విలువ చేసే టేకు కలప మంథని డివిజన్ కేంద్రంగా ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు రవాణా అవుతోంది. అరుునా అటవీ అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మంథని ప్రాంతం నుంచి గోదావరిఖని వైపు రూ. 5 లక్షల విలువచేసే కలపలోడుతో వెళ్తున్న లారీ బుధవారం జీడీకే-11గని చెక్‌పోస్టు వద్ద పట్టుబడింది. మంథని మండలం పోతారం గ్రామంలో రూ. 22 వేలు విలువచేసే టేకు కలప అటవీశాఖ అధికారులు, పోలీసులు నిర్వహించిన సోదాలో దొరికింది. గోదావరినది దాటి తూర్పు డివిజన్‌కు దిగుమతి అవుతున్న కలప మహదేవ్‌పూర్, మహముత్తారం, మంథని మండలాలకు ఎడ్లబండ్ల ద్వారా రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి సైజులు, ఫర్నిచర్ రూపంలో నిత్యం లారీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు పెద్ద ఎత్తున్న తరలుతోంది.

 

పట్టని అధికారులు...

తూర్పు డివిజన్‌లోని అటవీ గ్రామాల్లో పెద్ద ఎత్తున టేకు కలప నిల్వలున్నాయనే ఆరోపణలున్నారుు. అరుునా అధికారులు దాడులు నిర్వహించిన సందర్భాలు మచ్చుకు కానరావడంలేదు. ఎక్కడైనా కలప పట్టుబడితే ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. గతంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రం) రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు సమావేశమై సరిహద్దుల్లో నిఘా పెట్టినా కలప అక్రమ రవాణాను అదుపు చేయలేకపోయూరు. స్మగ్లర్ల నుంచి ప్రతి నెలా ముడుపులు పుచ్చుకుంటున్న అధికారులు కలప రవాణాపై దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వ స్తున్నారుు.

 

తుపాకులేవీ?

కలప అక్రమ రవాణా నియంత్రణ కోసం అటవీశాఖ అధికారులకు తుపాకులు కేటాయించాలన్న ప్రతిపాదన ఆచరణకు నోచుకోవడంలేదు. ఆయుధాలు లేవనే సాకు చూపుతున్న అధికారులు అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని పలువురు అంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top