వాటర్‌గ్రిడ్‌ పనుల్లో వేగం పెంచండి

వాటర్‌గ్రిడ్‌ పనుల్లో వేగం పెంచండి


► పదేళ్ల వరకు నిర్మాణ సంస్థలదే బాధ్యత

► వాటర్‌గ్రిడ్‌ రిజర్వాయర్‌

► శంకుస్థానలో మంత్రి తుమ్మల




దమ్మపేట: వచ్చే ఉగాది నాటికి శుద్ధి చేసిన గోదావరి జలాలను ఇంటింటికి ఉచితంగా సరఫరా చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం గండుగులపల్లి శివారులో దుర్గమ్మగట్టుపై మిషన్‌ భగీరథ(వాటర్‌గ్రిడ్‌)లో భాగంగా నిర్మాణం చేస్తోన్న బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు ట్రైకార్‌ చైర్మన్‌ తాటి వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ పిడమర్తి రవిలతో కలసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. గండుగులపల్లి దుర్గమ్మగట్టు నుంచి దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోని అన్ని గ్రామాలకు గోదావరి జలాలను అందించేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసినట్లు చెప్పారు.



అందుకుగాను రెండు మండలాల్లో 182 మంచినీటి ట్యాంకులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.4500 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత పదేళ్ల వరకు వాటి నిర్వహణ బాధ్యతలను ఆయా సంస్థలే నిర్వహిస్తాయని తెలిపారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయా అధికారులకు సూచించారు. గుండాల, చర్లతో పాటు, భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలాల్లో చేపట్టిన రోడ్లు, వంతెనల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.



కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీఓ రవీంద్రనాథ్, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఈఈ రవీందర్, డీఈ శివరామప్రసాద్, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ షకిలాభేగం, డీసీసీబీ డైరక్టర్‌ ఆలపాటి రామచంద్రప్రసాద్, ఎంపీపీ అల్లం వెంకమ్మ, జెడ్పీటీసీ దొడ్డాకుల సరోజని, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ తానం లక్ష్మి, వైస్‌ చైర్మన్‌ కొయ్యల అచ్యుతరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పానుగంటి సత్యం, పైడి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్‌ కేవీ సత్యానారాయణ, పోతినేని శ్రీరామవెంకటరావు తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top