రాష్ట్రానికి మూడు హడ్కో అవార్డులు

రాష్ట్రానికి మూడు హడ్కో అవార్డులు


- మిషన్‌ భగీరథకు వరుసగా రెండో ఏడాదీ అవార్డు

- హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానం




సాక్షి, న్యూఢిల్లీ: హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో వివిధ విభాగాల్లో వినూత్న ఆలోచనలను అమలు చేసినందుకు పలు సంస్థలకు, ప్రభుత్వ పథకాలకు ప్రదానం చేసిన అవార్డుల్లో తెలంగాణకు మూడు అవార్డులు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మంచి నీటి సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథకు అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో వినూత్న పథకంగా భగీరథకు వరుసగా రెండో ఏడాది కూడా లభించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య చేతుల మీదుగా చీఫ్‌ ఇంజనీర్‌ సురేందర్‌ రెడ్డి అవార్డు అందుకున్నారు.



ఈ సందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భగీరథ పనులు 60–65 శాతం పూర్తయ్యాయని, త్వరలో మలివిడత పనులను ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభింపజేయాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ (టీఎస్‌ఐఐసీ)కు అవార్డు లభించింది. హడ్కో సాయంతో సుమారు 14 వేల ఎకరాల్లో చేపడుతున్న హైదరాబాద్‌ ఫార్మా సిటీకి, అలాగే 12,500 ఎకరాల్లో చేపట్టిన నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌)కు కలిపి ఈ అవార్డు దక్కింది. వెంకయ్య చేతుల మీదుగా టీఎస్‌ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి అవార్డు అందుకున్నారు. గ్రామీణ స్థాయిలో ఆర్థికాభివృద్ధిని సాధించినందుకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు జీఎం సురేందర్‌ రాజు అవార్డు అందుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top