హార్టికల్చర్‌కు అనుకూలమే!

హార్టికల్చర్‌కు అనుకూలమే! - Sakshi


సాక్షిప్రతినిధి, నల్లగొండ :బత్తాయి సాగుకు జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. రాష్ట్రంలోనే కాదు... దేశంలోనే జిల్లాది ప్రథమస్థానం. జిల్లాలో 5లక్షల హెక్టార్ల సేద్యపు భూమిలో ఉద్యానవన పంటలసాగు ఏకంగా 1.20లక్షల హెక్టార్లు. ఇందులో బత్తాయిసాగు ఏకంగా 70శాతం విస్తీర్ణంలో ఉంది. దీంతోపాటు మామిడి, నిమ్మ వంటి తోటల పెంపకంతోపాటు, అరటి, సపోటా, బొప్పాయి, జామ, దానిమ్మ తోటల సాగూ బాగానే ఉంది. మునుపెన్నడూ లేని రీతిలో ఉద్యానవన పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. కేవలం ఒక్క బత్తాయి దిగుబడి ద్వారానే జిల్లాలో 1600 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే మరింత ఊతం లభిస్తుందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

 

 రైతులను ఆదుకోలేకపోతున్న పథకాలు

 జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా రాష్ట్రీయ ఉద్యానవన మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన తదితర పథకాలు అమలవుతున్నా అవి ఏ మాత్రమూ రైతులను ఆదుకోలేకపోతున్నాయి.  ఉద్యానవన కార్యక్రమాల అభివృద్ధి,  రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సలహాలు ఇవ్వడానికి, ప్రయోగాలు చేసే ఆదర్శ రైతులకు బాసటగా నిలవడానికి హార్టికల్చర్ యూనివర్సిటీ ఎంతో ఉపకరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పక్కనే ప్రభుత్వ భూమి సుమారు వెయ్యి ఎకరాల దాకా ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కాకుంటే ఇవి చవుడు నేలలు కావడం ప్రతికూలాంశమని చెబుతున్నారు.



ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కనీసం 1200 నుంచి 1500 ఎకరాల భూమి అవసరం ఉంటుందని, నీరు సమృద్ధిగా ఉండాలని ఉద్యానవనశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. పంటల ప్రయోగాలకు, కొత్త వంగడాల తయారీకి అనువైన భూములు, నీరున్న ప్రాంతాన్ని అధికారులే గుర్తించాల్సి ఉంది.  ఇప్పటికే మార్కెట్ సౌకర్యం లేక, ఒక్కోసారి ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల బత్తాయి రైతు విసిగి వేసారాడు. ఇక, మావల్ల కాదని.. తోటలు నరికి మళ్లీ వరి వైపు పరుగులు పెడుతున్నారు. ఈ పరిణామం మరిన్ని అనర్థాలకు కారణం అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భూగర్భ జలాల వినియోగంతోపాటు, విద్యుత్ వినియోగమూ బాగా పెరిగే ముప్పు ఉంది. ఈ పరిస్థితుల్లో బత్తాయి రైతులు తోటల పెంపకం నుంచి పక్కకు తప్పుకోకుండా చూడడానికి హార్టికల్చర్ యూనివర్సిటీ కొంతవరకు ఉపయోగ పడుతుందని చెబుతున్నారు.

 

 యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే...

 జిల్లాలో ఉద్యానవన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే అది రైతుల పాలిట వరమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 కనీసం 150 మంది శాస్త్రవేతలు యూనివర్సిటీలో కొలువుదీరే అవకాశం ఉంది.

 మరో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వీటిలో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించాలన్న నిబంధన కూడా ఉంది.

 తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన కొత్త రకాల సృష్టి ఇక్కడే జరుగుతుంది కాబట్టి, జిల్లా రైతుల పొలాలే ప్రయోగశాలలు అవుతాయి.

 రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు శాస్త్రవేత్తల ద్వారా తక్షణం అందుతాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top