వేర్వేరు కారణాలతో ముగ్గురి బలవన్మరణం


చౌటుప్పల్ :స్కూల్‌కు వెళ్లలేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెంది, కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని కుంట్లగూడెంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోగ సత్యనారాయణ చేనేత కార్మికుడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. కుమార్తె బోగ పూజ(13) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సోమవారం పాఠశాలకు వెళ్లకపోవడంతో తండ్రి ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఓ గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకొని, కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు చూసి, మంటలను ఆర్పి వేశారు.అప్పటికే బాగా కాలిపోయింది. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసు ఇన్‌స్పెక్టర్ భూపతి గట్టుమల్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

 జమ్మాపురంలో..

 జమ్మాపురం (భువనగిరి అర్బన్) : పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని  జమ్మాపురంలో గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివారల ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్నాబత్తిని రవికుమార్(30)కు మూడు సంవత్సరాల క్రితం మూటకొండూరు గ్రామంలోని సికిందర్‌నగర్‌కు చెందిన స్వాతితో వివాహం జరిగింది. రెండు సంవత్సరాల క్రితం తర్వాత వారి మధ్య విభేదాలు వచ్చి కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి రవికుమార్ ఒంటరిగానే ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతను మద్యం డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించసాగాడు.నెల రోజుల నుంచి ఇంట్లో తగాదాలు ఎక్కువ య్యాయి. రవికుమార్ మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు అతడిని భువనగిరి  పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్ని దర్యాప్తు చేస్తున ట్లు రూరల్ ఏఎస్‌ఐ నర్సింగరావు తెలిపారు.

 

 రైలుకిందపడి..

 యాదగిరిగుట్ట :  రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని రామాజీపేట రైల్వేగేటు సమీపంలో జరిగింది. భువనగిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలాగౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్‌కు చెందిన కళ్యాణ్‌కుమార్ (27 )అదే ప్రాంతంలో ఓ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి నాలుగు నెలల క్రితం వివాహమైంది. పుట్టుకతోనే మూగవాడు. పెళ్లి జరిగిన తర్వాత కంపెనీలో పనికి సరిగ్గా వెళ్లడం లేదు. దీంతో  పెద్దలు మందలించారు. దీంతో అతడు మనస్తాపానికి గురై సోమవారం తెల్లవారుజామున రామాజీపేట రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ మేరకు భువనగిరి రైల్వే హెడ్ కానిస్టేబుల్ బాలాగౌడ్  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top