రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి

రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలి


యాదగిరిగుట్ట :తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీకి తక్షణమే రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ కేటాయించాలని సీపీఐ జాతీయ నాయకుడు, ఆర్టీసీ ఈయూ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా డిమాండ్ చేశారు. బుధవారం గుట్టలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆరీసీ కార్మికులకు రెండవ రోజు నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ తరగతుల శిబిరంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం తగిన బడ్జెట్‌ను ఆర్టీసీకి కేటాయించకపోతే మరింత దుర్భర పరిస్థితులు ఎదురవుతాయన్నారు. సీఎం కేసీఆర్ రాయితీలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేయకపోతే సహించేది లేదన్నారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని ముఖ్యమంత్రి మరవొద్దన్నారు.

 

 అద్దె బస్సులను తీసుకోవాలనే నిర్ణయాన్ని  విరమించుకోవాలని కోరారు. దీని వల్ల ఆర్టీసీ కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. తక్షణమే ఆర్టీసీ తెలంగాణ , ఆంధ్రా రాష్ట్రాల మధ్య పూర్తి స్థాయిలో విభజన చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి మాట్లాడుతూ సీసీఎస్‌కు ఆర్టీసీ యాజమాన్యం బకాయిలు పడటం వల్ల 25 వేల మంది కార్మికులకు రుణాలు అందడం లేదన్నారు. 22 వేల మంది కార్మికులు సీీసీఎస్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకొని పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాల్లో సీసీఎస్ కోసం 8 శాతం డబ్బులు రికవరీ చేసి ఆ డబ్బులను ఆర్టీసీ యాజమాన్యం సొంతానికి వాడుకోవడం అన్యాయమన్నారు.

 

 సొసైటీ డబ్బులను ఆర్టీసీ యాజమాన్యం సొంతానికి ఎలా వాడుకుంటుందని ప్రశ్నించారు. దీని వల్ల రూ. 25 కోట్ల వడ్డీ సొసైటీకి నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను ఇవ్వకుంటే వచ్చే నెల 11 నుంచి కార్మికులమంతా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. శిక్షణ తరగతుల్లో ఆ సంఘం నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి,  గోద శ్రీరాములు, బొల గాని సత్యనారాయణ, పి.ఉపేందర్, వెంకటేశ్వర్లు , నల్లమాస జగదీశ్‌గౌడ్, మల్లయ్య, శ్రీనివాస్, పద్మ, చారి, డీఏ రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top