ముచ్చటగా మూడోసారి..!

ముచ్చటగా మూడోసారి..! - Sakshi


తాండూరు/పెద్దేముల్: విజయా బ్యాంకులో దోపీడీ యత్నం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతోంది. ఈ ఘటనలో అటు పోలీసులతో పాటు ఇటు బ్యాంకు అధికారుల ఉదాసీన వైఖరి తేటాతెల్లమవుతోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఈ బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించడం గత రెండేళ్లలో ఇది మూడోసారి. పెద్దేముల్ పోలీసుస్టేషన్‌కు అతిదగ్గరలోనే విజయబ్యాంకు ఉంది. ఇద్దరు దొంగలు రాత్రి తాపీగా బ్యాంకుకు కన్నం వేసి దోపిడీకి యత్నిస్తున్న విషయాన్ని పోలీసులు పసిగట్టలేకపోవడం గమనార్హం.

 

మండల కేంద్రంలో.. అందునా పీఎస్‌కు అతి సమీపంలోనే గస్తీ ఇలా ఉంటే ఇక గ్రామాల రక్షణ పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రానికి చెందిన మోసీన్, మునీర్లు అనే యువకులు బ్యాంకు నుంచి శబ్దం వస్తుండటాన్ని  గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఒకవేళ వారి ద్దరూ ఆ సమయంలో అటువైపుగా వెళ్లకుంటే కచ్చితంగా బ్యాంకులో దోపీడీ జరిగేదని స్థాని కులు చెబుతున్నారు. రాత్రిపూట పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నా.. అది నామామాత్రంగా మారడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

గతంలో తాండూరు-జహీరాబాద్ మా ర్గంలో దారిదోపిడీ జరిగింది. ఏకంగా రోడ్డుకు అడ్డుగా చెట్టు పెట్టి దుండగులు పెళ్లి బృందాన్ని దోచుకున్నారు. గత ఏడాది ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులపై అడ్డగించి దోపిడీకి పాల్పడ్డారు. గతంలో విజయాబ్యాంకులో జరిగిన రెండు చోరీ యత్నాల కేసుల్లోనూ పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదు.

 

బ్యాంకు అధికారుల నిర్లక్ష్య వైఖరి..

ఇక విజయబ్యాంకు అధికారులు బ్యాంకు భద్రతపై ఊదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే రెండుసార్లు ఈ బ్యాంకులో దోపిడీ యత్నాలు జరిగినా కనీసం సెక్యురిటీ గార్డును కూడా ఏర్పాటుచేయకపోవడం బ్యాంకు అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. రోజు లక్షల్లో లావాదేవీలు కొనసాగించే ఈ బ్యాంకు వద్ద భద్రత చర్యలు శూన్యమనే చెప్పాలి.



రెండేళ్ల క్రితం కిటికీల ఇనుప చువ్వలు తొలగించి బ్యాంకులో దోపిడీకి ప్రయత్నించారు. అలాగే మూడు నెలల క్రితమే బ్యాంకుకు కన్నం వేసి దోపిడీ యత్నం జరిగింది. బ్యాంకులోని ఏటీఎంను దొంగలు ధ్వంసం చేశారు. కానీ డబ్బులు పోలేదు. బ్యాంకు తీసే వరకు పోలీసులకు, బ్యాంకు అధికారులు ఈ దోపిడీ యత్నం జరిగిన విషయం తెలియరాలేదు.

 

బ్యాంకులో ఉన్న ఒకే ఒక్క సీసీ కెమెరా కూడా 24 గంటలపాటు పనిచేయదు. కేవలం బ్యాంకు పని వేళల్లోనే అది పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలోనే రెండు సార్లు దోపిడీ యత్నాలు జరిగినా ఎందుకు తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదని మంగళవారం బ్యాంకును పరిశీలించిన జిల్లా ఎస్పీ రాజకుమారి బ్యాంకు సిబ్బందిని ప్రశ్నించడం గమనార్హం. ఇకమీదనైనా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని బ్యాంకు అధికారులకు ఎస్పీ సూచించారు.

 

ఇకపై మరింత పకడ్బందీగా గస్తీ..

పెద్దేముల్: రాత్రి గస్తీని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఎస్పీ దోపిడీ యత్నం జరిగిన విజయ బ్యాంకును సందర్శించారు. ఎస్పీ మాట్లాడుతూ కర్ణాటక సరిహద్దులో పెద్దేముల్ మండలం ఉన్నందున గస్తీని ముమ్మరం చేయనున్నట్లు చెప్పారు. అనుమానిత వ్యక్తుల సమాచారం ఇచ్చి ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. స్థానిక యువకుల సమాచారంతోనే బ్యాంకు దోపిడీ యత్నానికి పాల్పడిన దొంగలను పట్టుకున్నామన్నారు.

 

పటిష్ట రక్షణ చర్యలు తీసుకుంటాం

పెద్దేముల్‌లోని విజయబ్యాంక్‌లో వెంటనే సీసీ కెమెరాలు, నైట్ వాచ్‌మన్‌ను ఏర్పాటు చేస్తామని విజయబ్యాంక్ డీజీఎం వినోద్‌కుమార్‌రెడ్డి అన్నారు. బ్యాంకులో డోపిడీ యత్నం జరిగిన విషయాన్ని తెలుసుకున్న డీజీఎం విజయబ్యాంక్‌ను సందర్శించారు. దోపిడియత్నం గురించి స్థానిక బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బ్యాంక్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయని లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top